ప్రియుడి తో పెండ్లి చేస్తాం అని చెప్పి హత్య చేశారు

జహీరాబాద్‌ : సంగారెడ్డి జిల్లాలో జరిగిన దళిత బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లిలో జరిగిన ఈ సంఘటనను పోలీసులు సవాలుగా తీసుకుని రెండు రోజుల్లోనే ఛేదించారు. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో ప్రేమలో పడిందన్న కోపంతో కన్నతల్లే తన ప్రియుడితో కలసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డీఎస్పీ శంకర్‌రాజు, సీఐ రాజశేఖర్‌ బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. హుగ్గెల్లికి చెందిన గడ్డం బుజ్జమ్మకు కూతురు మౌనిక (16), కొడుకు సురేశ్‌(22) ఉన్నారు.

అంతా పథకం ప్రకారమే..: ఈ నేపథ్యంలో బుజ్జమ్మ కాశీంపూర్‌కు చెందిన తన ప్రియుడు నరసింహులుతో చర్చించి ఇద్దరూ కలసి కూతురిని హత్య చేయడానికి పథకం రచించారు. ప్రియుడితో పెళ్లి జరిపిస్తామని తల్లి బుజ్జమ్మ, నరసింహులు మౌనికకు చెప్పి ఆదివారం రాత్రి గ్రామ శివారులోని మామిడి తోటకు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత అనుకున్న పథకం ప్రకారం.. తల్లి బాలిక కాళ్లపై కూర్చోగా నరసింహులు బాలిక మెడకు చున్నీ బిగించి ప్రాణం తీశాడు. అనంతరం గ్రామస్తులను నమ్మించేందుకు కూతురు తమకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పారు.

తర్వాత మౌనిక మృతి విషయం వెలుగులోకి రావడంతో తన కూతురును ప్రేమించిన యువకుడే హత్య చేశాడని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు తల్లే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. నరసింహులు, బుజమ్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకున్న జహీరాబాద్‌ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ రవిగౌడ్‌ను డీఎస్పీ అభినందించారు