ధర్పల్లిలో ఉద్రిక్తత.. పసుపు రైతులపై బీజేపీ కార్యకర్తల దాడి
నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లిలో (Dharpally) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలు, పసుపు రైతులకు మధ్య ఘర్షణ చోటుకున్నది. దీంతో బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి గాయపడ్డారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఎంపీ ధర్మపురి అరవింద్ వస్తున్నాడని తెలుసుకున్న పసుపు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు.పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్.. సమాధానం చెప్పాలంటూ పసుపు రైతులు డిమాండ్ చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈక్రమంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపక్షాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణా రెడ్డి తలకు గాయమయింది. పోలీసులు ఆయనను దవాఖానకు తరలించారు.