మేడారం జాతరకు వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం. నలుగురు మృత్యువాత

ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీటీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం మూల మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలవ్వగా ములుగు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. బస్సు ముందు భాగం కూడా కొంత దెబ్బతింది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి మేడారం వస్తుండగా.. కారు హన్మకొండ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మేడారం వెళ్లే  మార్గం కావడంతో ఘట్టమ్మ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

మేడారం జాతరలో భాగంగా ములుగు జిల్లాలో ఈరోజు ఆర్టీసీ బస్సు – కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, సంబంధిత వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.