అంబేద్కర్ ఆశయానికి తూట్లు

మహనీయుల జయంతులు ఏప్రిల్ మాసంలో విరివిగా జరుపుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఏప్రిల్ 14 తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ముఖ్యమైనది. ఈ రోజున న ఖద్దరు బట్టలు ధరించి, అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నాలుగు ఫోటోలకు ఫోజులు ఇచ్చి జై భీమ్ అనే నినాదం చేస్తారు. ఆయన కోరుకున్నది ఇదేనా….!?
ఆయన ఆశయాలకు, ఆచరణ ఇంతేనా…!?
ఇంతకీ ఆయన పోరాటం చేసిన వివక్షత , అంటరానితనం ఈనాటికైనా నెరవేరిందా…!?
ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీ గుండె పై చేయి వేసుకుంటే అసలైన జవాబు నువ్వే చెప్పగలరు.

ఆధునికతను అందిపుచ్చుకుంటున్న ఈ కాలంలో కూడా అణగారిన వర్గాల బ్రతుకుల్లో బాధలు కొంతవరకైనా తీరాయా..‌? కుల, మత ,వర్గ, ఛాందసవాదులు నాటికి, నేటికి ఈ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.” చాపకింద నీరులా” మనువాద సిద్ధాంతాలను ఆచరిస్తూనే వున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఆ విషయం బహిర్గతమవుతుంది. ఈ నిచ్చెనమెట్ల సమాజంలో అంటరానివారు, సబ్బండ వర్గాలవారు “ఉత్పత్తి సాధనం”గా మాత్రమే పనిచేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహర్నిశలు శ్రమించి వ్యక్తిగత జీవితంను సమాజ శ్రేయస్సుకై అంకితం చేసి రాసిన రాజ్యాంగం లో సబ్బండ వర్గాల వారి స్థానం ఉన్నతీకరించాలంటే ‘రాజ్యాధికారం’ అందిపుచ్చుకోవాలి అన్నారు. అందుకు అనుగుణంగానే’ ఓటు హక్కు’ అనే ఆయుధాన్ని మనకు అందించారు. కానీ అదే ఓటు హక్కు దొరల జేబులో ఉన్న కరెన్సీ నోట్ కు తాకట్టు పడింది.

“అందని ద్రాక్షపండ్లు పుల్లన”
అనే చంధంగా దళితులకు రాజ్యాధికారం అందరి ఫలంగానే చేస్తున్నారు. ఎన్ని చదువులు చదివిన, ఎన్ని కొలువులు ఏలినా…. నీ స్థాయి గీడనే ….అని రుజువు చేస్తున్నారు. అందరికీ చదువు, సమాన అవకాశాల కోసం ఏళ్ల తరబడి శ్రమించాడు. అస్పృశ్యత, అంటరానితనాన్ని కూకటివేళ్లతో పెకలించి చడానికి, అక్షర జ్ఞానం తో విశ్వాన్ని గెలిచి బడుగు బలహీన వర్గాల వారికి వెలుగు బాటలు వేశాడు దార్శనికుడు అంబేద్కర్. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు గడుస్తున్నా, తాను కాంక్షించిన ఆశయాలు ఆచరణ లోనికి రాక పోవడం విడ్డూరంగా ఉంది దానికి ప్రధాన కారణం ఎవరో…ఏయే శక్తులు సబ్బండవర్గాల వారిని పావుగా వాడుకుంటున్నారో…? అందరికి తెలిసిన నగ్న సత్యం.

మూతికి ముంత నడుముకు చీపురు పట్టుకొని కట్టు రాజకీయ బానిసలుగా తయారు చేస్తుండ్రు. పార్టీ జెండాలను భుజాన ఎత్తుకునే కూలీలు అని చూస్తుండ్రు. ఓటు బ్యాంకు రాజకీయాలకోసం నాయకులు ఊసరవెల్లి వేషాలు వేస్తుండ్రు. “నోటితో నవ్వి నొసలుతో వెక్కిరించినట్టు”మన బలాన్ని, బలగాన్ని వాడుకొని అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ రకమైన వికృత ధోరణి దేనికి సంకేతం …?
ఇంకా ఎన్ని ఏండ్లు ఎస్సీ ,ఎస్టీ, బీసీ వర్గాల వారి మీద ఆధిపత్యం..? అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగ నిర్మాత ఆశయాలు, ఆలోచన ,ఆచరణ ఇవేనా….!? స్వాతంత్ర భారతదేశంలో కూడా రోజు ఏదో ఒక చోట వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు అయితేనేమి…? రాజకీయ నాయకులు అయితేనేమి..? వ్యవస్థ లో పనిచేస్తున్న వారే అయితే నేమి…? ప్రతి ఒక్కరు మినహాయింపు లేకుండా వివక్ష సంకెళ్ళలతో నలిగిపోతున్నారు.

దళిత స్త్రీల పై అత్యాచారాలు అరాచకాలు రోజురోజుకీ పెరట్రెగిపోతున్నాయి. అధికార మదం తో కుల దుహంకారంతో వికృత చేష్టలు చేస్తూ సమాజాన్ని అంధకారంలోకి తీసుకెళ్తున్నారు. చట్టం న్యాయం సామాన్యులకు ఆమడ దూరం .అభివృద్ధి ఫలాలు అట్టడుగు జాతుల వారికి కూడా అందినప్పుడే నిజమైన దేశాభివృద్ధి. చరిత్రను వక్రీకరించడం మనువాదులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ చరిత్రను ఖచ్చితంగా రాసే ధైర్యం బహుజనవాదం కలిగిన వారికే ఉంటుంది . ఈ ఆధునిక కాలంలో రిజర్వేషన్లకు అర్థం మారిపోతుంది. సమాజంలో అట్టడుగున ఉన్న కులాల వారికి అందించిన అగ్రతాంబూలం ఈ రిజర్వేషన్లు. ఇప్పుడు ఎందుకు బహురూపులను సంతరించుకుంటుంది. దీని వెనక ఎంతో రాజకీయకుట్ర దాగి ఉంది. ఇందులో దాగి ఉన్న మతలబు దేశ మూలవాసీ లు ఆలోచించాలి. ఇక్కడే అంబేద్కర్ అందరివాడా…? కొందరి వాడా…? అని అన్వేషించాలి.

బడుగు ,బలహీనవర్గాల ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలి. ఉచిత పథకాలు కాదు… రాబోయే తరాలకు మూలస్తంభాలుగా నిలిచే “యువతీ యువకులకు “ఉపాధి కల్పించాలి. పాలించడం అంటే వనరులను దోచుకోవడం ,దాచుకోవడం కాదు సమీకృతం చేయుటం.
సమ సమాజాన్ని స్థాపించి చరిత్ర మరువని మహనీయుల అడుగుజాడల్లో నడవడం, నడిపించటం . నిరుడు ఎంతో మంది రాజకీయ నాయకులు నిస్వార్థ పాలన చేసిన గుమ్మడి నర్సయ్య, మల్లు స్వరాజ్యం ఎందరో మరెందరో మనకు ఆదర్శప్రాయం. ఏ సిద్ధాంతాలు అయినా ప్రజలకు మంచి చేయమనే చెబుతాయి. దేశ తలరాతను మార్చి రాసే మరో అంబేద్కర్ కావాలా…? రావాలా…? ఆయన ఆశయాలను ,ఆచరణ బద్దం చేస్తే చాలు, దేశ గతి ప్రగతి బాట పడుతుంది.
వివక్షత.. ఇంకా సమాజంలో పూర్తిగా తొలగిపోలేదు అని చెప్పుటకు… మచ్చుకు కొన్ని ఉదాహరణలు….
మొన్నటికి మొన్న కర్ణాటకలో మాజీ మంత్రి ని కూడా ఆలయ గర్భగుడిలోకి రానివ్వలేదు. అంతెందుకు మన దేశ మొదటి పౌరుడికి కూడా మినహాయింపు కాని సందర్భాలు కోకొల్లలు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి కూడా అస్పృశ్యత, అంటరానితనం, వివక్షతలు పోట్రాయి లా తగులుతూనే ఉన్నాయి. ఇలా అయితే దళితులు ,సబ్బండ వర్గాల వారికి ఈ వ్యవస్థలోని అవస్థలు నిత్యకృత్యమే. వాటిని వివరించుటకు బహుశా నా కలానికి ఇంకా పదును పెట్టాలేమో…?

ప్రశ్నించని చోట… ప్రగతి ఉండదు “బోధించు- సమీకరించు “అన్న నినాదాన్ని, ఆ మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి. అజ్ఞానాన్ని పారద్రోలే విద్యను అందరికీ అందించాలి. వేరువేరుగా ఏరులై పారుతున్న వివిధ రకాల అణగారిన కులాలను, జాతులను ఒక తాటిపైకి తేవాలి. బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలి .ఏళ్ల తరబడి అభివృద్ధికి అడ్డంగా ఉన్న వివక్షత బద్దలు(Break the boiass) కొట్టాలి. మేక తోలు కప్పుకున్న తోడేళ్ళ తరిమితరిమి కొట్టాలి. బహుజన వాదాన్ని సుస్థిరం చేయాలి. దండోరా డప్పు, కళాకారుల గజ్జె, అమరుల పాట గొంతెత్తి పాడితే, తరతరాలుగా ఏలుతున్న రాజ్య పీఠానికి బీటలు పడాలే. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి .అణగారిన వర్గాలు అధికారం చేపట్టాలి .అప్పుడే అంబేద్కర్ ఆశయాలు అక్షర సాక్షిగా నిలుస్తాయి. “తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ “ఈ గడ్డ మీద మరో బహుజన గొంతుకల యుద్ధం జరగాలి. అణగారిన బతుకుల్లో వెలుగుల ,జిలుగులు విరజిమ్మాలి. సబ్బండ వర్గాలు బహుజన పొద్దునే చూడాలే.

                                జై భీమ్,,దరిపెల్లి స్వరూప.