అమ్మ తర్వాత అమ్మ అంగన్వాడీ లకు తెలంగాణ లో భేష్

అమ్మ తర్వాత అమ్మలా చిన్నారుల ఆలనాపాలనా చూస్తూ, గర్భిణీలకు పోషకాహారం అందిస్తూ అనిర్వచనీయమైన సేవలందిస్తున్న అంగన్‌వాడి కేంద్రాల పట్ల, వాటిలో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయకుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. భవిష్యత్‌ భారత తరాన్ని నిర్మిస్తున్న వారికి సముచిత గౌరవం ఇవ్వాలనే యోచన పాలకులకు మనస్కరించకపోవడం దుర్మార్గం. నామమాత్రపు పారితోషికంతో సరిపెట్టి అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అంగన్‌వాడీల చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయి. కోవిడ్‌ కష్ట సమయంలోనూ ఇంటింటికీ వెళ్లి గర్భిణీలకు, చిన్నారులకు పోషకాహారాన్ని అందజేసి సాహసోపేతమైన సేవలందించిన అంగన్‌వాడీల పట్ల పాలకుల్లో చులకన భావన ఉండటం ఆక్షేపణీయం. సమీకృత శిశు సంరక్షణ, అభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌)లో భాగంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రెడేషన్‌, మెరుగైన నిర్వహణ పేరుతో స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం వంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వం క్రమంగా చేతులెత్తేసే ఎత్తుగడలు వేస్తోంది. తిండి కలిగితే కండ కలదోరు.. కండ కలవాడేను మనిషోరు.. అని ఆహారానికి ఉన్న ప్రాధాన్యతను గురజాడ ఏనాడో నొక్కి చెప్పారు. స్వతంత్రమొచ్చి 75 ఏళ్ల గడిచిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అంటూ వేడుకులు జరుపుకుంటున్న పాలకులకు దేశంలో ఆకలితో అలమటించి చనిపోతున్నవారి ఈతి బాధలు పట్టడం లేదు. ఇక పోషకాహారం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల జాబితాలో భారత్‌ 101వ ర్యాంకుతో అట్టడుగున నిలిచిందంటే మనం ఎంతటి అధ్వాన్న స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చేనాటికి ఇదే సూచీలో 55వ ర్యాంకుతో కాస్త మెరుగైన స్థితిలో ఉన్న దేశాన్ని ఎనిమిదేళ్ల ఏలుబడిలో మోడీ సర్కార్‌ 101వ ర్యాంకుకు దిగజార్చింది. పౌరులను ఆకలి మంటల్లోకి నెట్టేసి అమృతోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు కాదా? భవిష్యత్‌ తరాల కోసం పెట్టుబడులు పెట్టడమే నేరం అన్నట్లు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించడం వల్లే దేశానికి దుస్థితి. అంగన్‌వాడీలపై ఖర్చు చేయడమంటే అది దేశ భవిష్యత్‌పై ఖర్చు చేయడం. ఈ సోయే పాలకులకు కరువైంది.
2018లో దీపావళి సందర్భంగా అంగన్‌వాడీలకు రూ.1000, సహాయకులకు రూ.500 చొప్పున పారితోషికం పెంచుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆయన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి స్కిల్డ్‌ వర్కర్లుతో సమానంగా వేతనాలు ఇస్తామని చాలా రాష్ట్రాలు హామీలు ఇస్తున్నాయి. భవిష్యత్‌ పౌరులుగా ఎదిగే తరాలను బాల్య దశలో బలిష్టంగా తయారు చేసే అంగన్‌వాడీ కార్యకర్తలను, సహాయకులను ఇలా వేతన జీవులుగా చూడటంలోనే చులకన భావన కనిపిస్తోంది. అమ్మలా లాలించి, ఉపాధ్యాయుల్లా విద్యాబుద్ధులు నేర్పే అంగన్‌వాడీల సేవలకు ప్రతిఫలంగా సముచిత గౌరవమివ్వాలి. ఆ గౌరవం మాటల్లో కాకుండా వారికందించే పారితోషికంలోనూ, భత్యాల్లోనూ ప్రస్ఫుటమవ్వాలి. అంగన్‌వాడీలు కూడా గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, కనీస వేతనాలతో సమానమైన పారితోషికం ఇవ్వాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఆ మాత్రం కోర్కెలు కూడా తీర్చలేకపోతే భావి భారత సమాజ నిర్మాణంపై పాలకులు శ్రద్ధ ఉన్నట్లా? ఇవే డిమాండ్లతో హర్యానాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు 75 రోజులుగా సమ్మె చేస్తుంటే అక్కడి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తీవ్రమైన పోలీసు నిర్బంధంతో వారిని అణిచేయాలని చూశారే మినహా వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మొగ్గు చూపడం లేదు. ఇంతకంటే దుర్మార్గముంటుందా ?
పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే అంగన్‌వాడీలపై కాస్తోకూస్తో శ్రద్ధ వహిస్తున్నాయి. కనీస వేతనం ఇవ్వకపోయినా మెరుగైన పారితోషికం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేరళలో అయితే రిటైర్‌మెంట్‌ తర్వాత పింఛను కూడా ఇచ్చి గౌరవిస్తోంది. తెలంగాణ కంటే మెరుగైన పారితోషికం ఇస్తామని ఎన్నికల వేళ ప్రకటించిన వైసిపి…ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రూ.1000 పెంచి అంతటితో చేతులు దులిపేసుకుంది. తెలంగాణలో వేతన సవరణ కమిషన్‌ ద్వారా అంగన్‌వాడీలకు పారితోషికంగా పెంచారు. కానీ ఏపిలో పిఆర్‌సి ఊసేలేదు. తెలంగాణ కంటే మెరుగైన పారితోషికమిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఇప్పుడు అంగన్‌వాడీలు ఉద్యమబాట పడుతున్నారు. ఇకనైనా అంగన్‌వాడీలకు పూర్తి స్థాయి ఉద్యోగులుగా సముచితమైన గుర్తింపును ఇవ్వడం, న్యాయమైన పారితోషికం ఇవ్వడం, అంగన్‌వాడీ కేంద్రాలను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడం…ఆ మేరకు నిధులు వెచ్చించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే భావి భారత సమాజం మెరుగ్గా తయారయ్యేది.