▪️పోటెత్తిన భక్తులు, కన్నుల పండుగగా కళ్యాణం..
▪️ రెండేళ్ళ తరువాత భక్తుల మధ్య స్వామి వారి కళ్యాణం..
▪️హాజరైన మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ, సత్యవతి రాథోడ్.
మహావెలుగు, ప్రతినిధి,మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం 10 ; రాములోరి కళ్యాణంతో భద్రాద్రి పులకించిపోయింది. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయంగా జరిపిన కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు శ్రీ అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్షంలోనే జరిగిన కళ్యాణం.. నేడు భక్తుల సందడితో భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతా రాముల కల్యాణానికి పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రి వేదికైంది. స్వామి వారి కళ్యాణంతో భద్రగిరి పులకించిపోయింది.
ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తరలించారు. సీతారాముల కల్యాణం వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. దీన్ని వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరైయ్యారు. ప్రభుత్వం తరుపున సంప్రదాయబద్ధంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు పట్టువస్త్రాలు, జిల్లా ఇంఛార్జి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వారితో పాటు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారు హాజరయ్యారు.కళ్యాణానికి వచ్చిన భక్తులకు వడదెబ్బ తగలకుండా.. తాగు నీటితో పాటు మజ్జిగ ఏర్పాటు చేశారు. భక్తజనులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచారు.భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నీడలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది.
