మహా వెలుగు నెట్వర్క్ : దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే, అంతర్జాతీయ పరిణామాలు, ఇతర కారణాలతో పెట్రో సంస్థలు ధరలను పెంచాయి. అయితే, దేశంలోని పలు రాష్ట్రాలు విధిస్తున్న పన్నులే పెట్రోల్ ధరలో సగం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. రూ. 100 పెట్రోల్ కొంటే అందులో సగానికిపైగా రాష్ట్రాల పన్నులే ఉంటున్నాయి.
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కూడా రూ. 100 పెట్రోల్ కొంటే అందులో 50 శాతం కంటే ఎక్కువ పన్నులే కావడం గమనార్హం. ఆ ఏడు రాష్ట్రాల వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర 52.5 శాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52.4 శాతం, తెలంగాణ రాష్ట్రంలో 51.6 శాతం, రాజస్థాన్ లో 50.8 శాతం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 50.6 శాతం, కేరళలో 50.2 శాతం, బీహార్ రాష్ట్రంలో 50.0 శాతం పన్నులే ఉన్నాయి. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో రూ. 100 పెట్రోల్‌పై 40 శాతం కంటే ఎక్కువగా పన్నులు విధిస్తున్నాయి.
కాగా, దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా పెరిగిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు నెలల తర్వాత చమురు సంస్థలు ధరలను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10గా, డీజిల్ ధర రూ. 95.40 పైసలకు చేరింది.
ఏపీలో పెట్రోల్ పై 88 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. దీంతో విజయవాడలో పెల్రోల్ లీటర్ ధర రూ. 110.80, డీజిల్ ధర రూ. 96.83గా ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 111.21 పైసలు, డీజిల్ రూ. 97.26కు చేరింది. గా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మనదేశంలోనూ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.