ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో భారీ స్థాయిలో అవినీతి

*మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ*

మహా వెలుగు,పెద్దపల్లి , ఆగష్టు 02: రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లుగా విమర్శలు వస్తున్నాయి. కార్మికుల నియామకం పేరుతో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని అమాయకుల్ని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిద్దరు కాదు సుమారు 800మంది దగ్గర డబ్బులు తీసుకొని తాత్కాలిక ఉద్యోగాలు కల్పించారని దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని పట్టుబడుతున్నారు విపక్షాల నేతలు. కార్మికుల దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

  పెద్దపల్లి జిల్లా రామగుండం రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎరువుల కర్మాగారంలో కార్మికులను అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరులు మోసం చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సెంట్రల్ గవర్నెంట్ జాబ్ పేరుతో స్థానిక ఎమ్మెల్యే కొరుకంటి చందర్ అనుచరులు 790మంది దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఆ విధంగా ఉద్యోగాలు పొందిన వాళ్లలో చాలా మందివి ఉద్యోగాలు ఉడిపోయి రోడ్డునపడ్డారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్లంతా తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఉద్యోగాల పేరుతో అవినీతి..

1999 మార్చి 31 న మూతపడ్డ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎరువుల కర్మాగారం కేంద్ర ప్రభుత్వ చొరవతో 2017 లో పునః ప్రారంభమైంది. కర్మాగారం ఎరువుల ప్యాకింగ్ , లోడింగ్ , అన్ లోడింగ్ కాంట్రాక్టును గుజరాత్‌కు చెందిన చౌదరి ఎంటర్‌ ప్రైజెస్ తీసుకుంది. ఫైవ్ స్టార్ రేటింగ్ కంపెనీగా ఉన్నప్పుడు కటింగ్స్‌ పోగా రోజు కూలీ రూ.619 వచ్చేవి. సుమారు 800 నుంచి 900 మంది కార్మికులకు ఉపాధి పొందేవాళ్లు. అయితే చౌదరి ఎంటర్ ప్రైజెస్ ఏంట్రీతో సీన్ మొత్తం రివర్సైపోయింది.