మహా వెలుగు ,జమ్మికుంట 04 : మైనర్ బాలికతో ఓ యువకుడు పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలుగుతూ ఫోటోలు, వీడియోలు తీసుకుని… వాటిని బయటపెడతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది.
: అభం శుభం తెలియని మైనర్ బాలికతో మొదట పరిచయం పెంచుకుని… ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ దారుణం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవపూర్ లో ఓ పద్నాలుగేళ్ల మైనర్ బాలిక కుటుంబంతో కలిసి నివాసముంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు(25) బాలికపై కన్నేసాడు. ఈ క్రమంలోనే బాలికతో పరిచయం పెంచుకున్న అతడు మాయమాటలతో నమ్మించి చాలా దగ్గరయ్యాడు. బాలిక అతడిని పూర్తిగా నమ్మడంతో సన్నిహితంగా వుండేది.

అయితే బాలికతో సన్నహితంగా వుండగా ఫోటోలు, వీడియోలు తీసుకున్న యువకుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఆ ఫోటోలు, వీడియోలను చూపించి బాలికను బ్లాక్ మెయిల్ చేసాడు. వీటిని మీ కుటుంబసభ్యులకు పంపిస్తానని… అలా చేయకుండా వుండాలంటే తన కోరిక తీర్చాలని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన యువతి దిక్కుతోచని పరిస్థితిలో యువకుడికి లొంగిపోయింది. ఇలా పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు

.
అయితే ఇటీవల అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో బాలిక భరించలేకపోయింది. దీంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. దీంతో ఆ తల్లి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిని బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.
ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు వైద్యపరీక్షల కోసం బాలికను హాస్పిటల్ కు తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్దారణ కావడంతో యువకుడిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచార కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
