కేసీఆర్‌ కు ఇంటిపోరు; ఆయన జాతీయ రాజకీయాల పాట వెనుక మతలబు చెప్పిన బండి సంజయ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో వివిధ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తేల్చి చెబుతున్నారు. ఏదైనా సరే గట్టిగా తలుచుకుంటే జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సాధనను ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత, తెలంగాణ అభివృద్ధి చెందిందని, బంగారు తెలంగాణ కల సాకారం అయిందని కెసిఆర్ చెబుతున్నారు. ఇక బంగారు భారతాన్ని నిర్మిద్దాం అంటూ కెసిఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు.

సీఎం కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది: బండి సంజయ్

ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంతనాలు జరుపుతూ బిజెపి ని టార్గెట్ చేస్తున్న సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఇంటి పోరు ఎక్కువైంది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తన కొడుకు కేటీఆర్ ని సీఎం సీట్లో కూర్చో పెట్టాలనే కుటుంబ ఒత్తిడి భరించలేక సీఎం కేసీఆర్ ఒత్తిడిలో కి వెళ్లారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జాతీయ రాజకీయాల పాట ఎత్తుకుంది అందుకే
ప్రజల దృష్టిని మళ్లించడానికి జాతీయ రాజకీయాల పాట ఎత్తుకున్నారని బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని ఇంట్లో టీవీలు, డైనింగ్ టేబుల్స్ పగలగొడుతున్నారు అని పేర్కొన్న బండి సంజయ్, దీంతో కేసీఆర్ ఏం చేస్తున్నాడో అర్ధం కాక, ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఏదేదో చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. తాను జాతీయ రాజకీయాలలోకి వెళ్తేనే కేటీఆర్ కు సీఎం గా పట్టం కట్టొచ్చు అని భావిస్తున్నాడని, కుటుంబ ఒత్తిడి తట్టుకోలేక జాతీయ రాజకీయాలను కెసిఆర్ కొత్త నాటకానికి తెరలేపారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పనైపోయింది
గతంలో చంద్రబాబు కూడా థర్డ్ ఫ్రంట్ పేరుతో దేశమంతా తిరిగారని, ఆఖరికి ఆయనకు టెంట్ కూడా లేకుండా పోయిందని గుర్తు చేశారు. కెసిఆర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని బండి సంజయ్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పనైపోయిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా ప్రజలు ఇప్పటికే కేసీఆర్ పాలనపై విరక్తితో ఉన్నారని, ఆయనను గద్దె దించటం ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే దిక్కు తోచని స్థితిలో ఉన్న కేసీఆర్ బీజేపీ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ, జిల్లాలకు తిరుగుతున్నారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

హస్తినకు బండి సంజయ్ తో పాటు బీజేపీ కీలక నేతలు
ఇదిలా ఉంటే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ పిలుపుతో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బండి సంజయ్ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీ అంతర్గత సమస్యలపై బండి సంజయ్ తో పాటు, తెలంగాణ ప్రాంత నేతలతో తరుణ్ చుగ్ చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పార్టీ శ్రేణులపై జరుగుతున్న వరుస దాడులు, పోలీసుల కేసులు అంశంపై కూడా అధిష్టానంతో చర్చలు జరపనున్నారు