మహా వెలుగు, రాజస్థాన్ ఆగష్టు 01: టెక్నాలజీ వాడకంతోపాటే సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఒకెత్తు, ఇకపై మరో ఎత్తు అన్నట్లు కేటుగాళ్లు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతోన్న వైనం సంచలనంగా మారింది. ఫేస్బుక్ పరిచయంతో ఓ సైబర్ నేరగాడికి అనుచరురాలిగా మారిన యువతి.. అమాయకులను కొల్లగొడుతున్న తీరు పోలీసులకే షాకింగ్ అనిపించింది. సదరు మోసగత్తెను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
ఎక్కడో రాజస్థాన్ లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడే ప్రధాన మోసగాడికి.. బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇస్తూ కమీషన్లు తీసుకుంటూ ఈ యువతి కోట్లలో డబ్బులు కొట్టేస్తున్న వైనం కలకలంగా మారింది. దీనికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. సిటీలోని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగగా, మహారాష్ట్రలో డొంక కదిలింది.
సైనిక్‌పురికి చెందిన బాధిత మహిళ గుర్తు తెలియని మెసేజ్‌కు స్పందించి, పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ వచ్చిన ఆఫర్‌కు బోల్తా పడి మొత్తం రూ.18.83 లక్షలు పొగొట్టుకుంది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంక్ ఖాతాల ఆధారాలతో మహారాష్ట్రకు చెందిన ఆల్ఫియా షేక్ ఇజ్రాయిల్‌ను అరెస్టు చేశారు. నిందుతురాలి నుంచి మొబైల్ ఫోన్, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
మహరాష్ట్ర వార్దా ప్రాంతానికి చెందిన ఆల్ఫియా షేక్ ఇజ్రాయిల్ నర్సింగ్ కాలేజీలో చదువుతూ, ఫర్ ఎవర్ లివింగ్ ప్రాడెక్ట్ అనే సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆ సంస్థ సామగ్రిని ఆన్లైన్లో విక్రయానికి పెట్టేది. ఈ క్రమంలో ఆమెకు రాజస్థాన్‌కు చెందిన రాజ్వీర్ పరిచయమయ్యాడు. వేగంగా డబ్బు సంపాదించేందుకు మార్గాలు చూపిస్తానని చెప్పి 3 రోజులకు బ్యాంక్ ఖాతాను అద్దెకు ఇస్తే రూ.3 వేలు ఇస్తానని చెప్పడంతో ఆమె తన ఖాతాను అద్దెకు ఇచ్చింది. ఇలా రాజ్వీర్ చెప్పినట్లు చేసి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారందరి నుంచి బ్యాంక్ ఖాతాలను తెరిపించింది.
ఖాతా వివరాలను రాజ్‌వీర్‌కు అందించేది ఆల్ఫియా. అందుకు ప్రతి ఖాతాకు 1000 కమీషన్, ఖాతాదారులకు రూ. 3 వేలు అద్దె ఇచ్చాడు. ఇలా మొత్తం పెట్టుబడులంటూ మోసం చేసిన నగదును ఈ ఖాతాల్లో బదిలీ చేసుకుని, ఆ తర్వాత వాటిని రాజ్వీర్ ఇతర వాలెట్లు, ఏటీఎమ్‌లు ద్వారా డ్రా చేసుకుని కోట్లు కొట్టేస్తున్నట్లు తేలింది. సైనిక్‌పురి ఫిర్యాదుకు సంబంధించి ఆల్ఫియా ఖాతాలో 1.14 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆల్ఫియా లాగే అకౌంట్లను అద్దెకిస్తూ మోసాలకు పాల్పడిన నజర్ భాషా అనే వ్యక్తిని మే నెలలో పోలీసులు అరెస్టు చేశారు
