ఖమ్మంలోని లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పీసీసీ చీఫ్ రేవంత్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.
ఖమ్మంలోని లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని కూడా కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఒకే ఒక్క రోజు రూ. 100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ (KTR) తెలిపారు. ‘‘గతంలో మురికి కూపంగా ఉన్న లకారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారు. లకారం చెరువు వద్ద తీగల వంతెనను ఏర్పాటు చేశాం. రోజుకు 2 వేల మంది అక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్లో జరగడం లేదు. ఖమ్మం నగరాన్ని నెంబర్‌వన్‌గా మార్చాలన్నది మంత్రి అజయ్ లక్ష్యం”అని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేక అసూయతో కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. 2014లో తెలంగాణ రాకముందు ఖమ్మం పట్టణం ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు.
మతం చిచ్చుపెట్టి..
కేంద్రంలోని బీజేపీ పై కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో కులం , మతం ,పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. బీజేపీ (BJP) మత విద్వేషాలను రెచ్చగోడుతుందని కేటీఆర్ అన్నారు. మతం చిచ్చుపెట్టి.. ఆ మంటల్లో చాలికాచుకుంటుందని ఆయన విమర్శించారు. విద్వేషం తప్ప మరేదానిపై బీజేపీకి చిత్తశుద్ది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇతర మతాలపై విషం చిమ్మే వ్యక్తులు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎందుకు ఈ విపరీత ధోరణులు కనిపిస్తున్నాయో ఆలోచన చేయాలన్నారు కేటీఆర్.
కుల పిచ్చి వాళ్లు కావాలా?..
రెడ్లకు పగ్గాలు ఇస్తేనే తాము అధికారంలోకి వస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని.. అలాంటి కుల పిచ్చి వాళ్లు కావాలా?, అన్ని కులాల వాళ్లు కావాలనే కేసీఆర్ కావాలా? అని కేటీఆర్ అడిగారు. కులం ఒక్కటే ఓట్లేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ఓట్లు వేస్తే వారు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఎందుకు తీసుకురాలేకపోయిందని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కొత్తగా ఆ పార్టీ చేసేదేమీ ఉండదన్నారు మంత్రి.