- శుభకృత నామ సంవత్సరాన్ని సిఎం కేసిఆర్ ఉద్యోగ నామ సంవత్సరం చేశారు
- రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
మహా వెలుగు ,భూపాలపల్లి, ఏప్రిల్ 25 : తెలంగాణ నుంచి ఎన్నికైన బిజెపి నేతలు పొద్దస్తమానం రాజకీయాలు చేయడం మాని కేంద్రం కూడా ఉద్యోగాలు భర్త చేసేలా ఒత్తిడి తెస్తే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి మరో 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, కనీసం వచ్చే రెండేళ్లు అయినా ఇచ్చిన హామీలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ 90వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తండ్రి గండ్ర మోహన్ రెడ్డి పేరు మీద పెట్టిన ట్రస్టు ద్వారా అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయమన్నారు. ఈ కోచింగ్ కార్యక్రమం సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. కోచింగ్ సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధిస్తే ఇదే ప్రాంతంలో కుటుంబాలతో కలిసి సక్సెస్ మీట్ పెట్టుకుందామని ప్రోత్సహించారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో మన నిధులు మనం ఖర్చు చేసుకోవడం వల్ల గతంలో లేని పథకాలు నేడు మనకు అమలవుతున్నాయన్నారు. తాజాగా ఉద్యోగాలను కూడా భర్తీ చేసుకుంటున్నామని చెప్పారు. వివిధ బోర్డుల ద్వారా నియామకాలు చేసుకుంటున్నామని, ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. పోలీసు బోర్డు, గురుకుల బోర్డు, టిఎస్ పిఎస్సీ ద్వారా ఇప్పటికే లక్షా 33వేల 942 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నామన్నారు. 91వేల 142 ఉద్యోగాలకు భర్తీ చేసుకోవాలని ఖాళీలను గుర్తించి, ఇందులో 11 వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసుకుంటున్నామన్నారు. మిగిలిన 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేసుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు బాగా వస్తున్నాయన్నారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు అన్యాయం జరుగొద్దని రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా సిఎం కేసిఆర్ నూతన జోనల్ విధానం తీసుకొచ్చారని, దీనివల్ల జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలని విభజించి భర్తీ చేసుకుంటున్నామన్నారు. ఫలితంగా స్థానికులకే ఉద్యగాలు ఎక్కువగా రానున్నాయన్నారు. గతంలో కొద్దిగా మంచిగా చదువుకున్న వారు ఎక్కడైనా ఉద్యోగాలు సాధించి, పోస్టింగ్ విషయంలో భూపాలపల్లి, ములుగు రావడానికి వెనుకాడేవారన్నారు. నూతన విధానం వల్ల ఇక ఈ బాధ ఉండదన్నారు. భూపాలపల్లి జిల్లాకు వచ్చే 918 ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే వస్తాయని, వీటితో పాటు మల్టీ జోనల్, జోనల్, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు కూడా మనం పోటీ పడవచ్చన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి , నేడు ఇక్కడ పర్యటిస్తున్నారని, ఇక్కడి ప్రజలకే మేలు చేసే అంశాలపై ఆలోచించాలని కోరారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు పోతున్నాయని చెప్పారు. ఈ 8 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల 20 వేల ఉద్యోగగాలు భర్తీ చేస్తుంటే… కేంద్రం కూడా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
గడిచిన 8 ఏళ్లు ఎలా చేశారు, ఏమి చేశారు పక్కన పెట్టి, కనీసం వచ్చే రెండేళ్లు అయినా అభివృద్ది మీద దృష్టి పెడితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఈ కోచింగ్ కేంద్రంలో ఆడపిల్లలు అధిక సంఖ్యలో ఉండడం చూస్తే సంతోషంగా ఉందన్నారు. కుటుంబాన్ని సమన్వయం చేస్తూ అన్నింట్లో నేటి మహిళ రాణిస్తున్నది అన్నారు. ఎవరికి లేని సహనం మహిళకు ఉంటుందని, అందుకే భగవంతుడు అంతటా ఉండలేక ఆడపిల్లను సృష్టించాడు అనే మంచి పేరు ఉందన్నారు. కాబట్టి ఉద్యోగ నియమకాల్లో ఆడపిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వారి కొడుకు, ట్రస్టు నిర్వాహకులు గండ్ర గౌతమ్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
