కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రైతుల రూ.2 లక్షల రుణ మాఫీ : రాహుల్ గాంధీ

మహా వెలుగు హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రైతుల రూ.2 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, ఎంపి రాహుల్‌ గాంధీ హామీ ప్రకటించారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ పార్టీలతో లాలూచీపడే నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి అవసరంలేదని తేల్చిచెప్పారు. టిఆర్‌ఎస్‌ పార్టీతో సంబంధాలు కొనసాగించే నేతలను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై నిఖార్సుగా కొట్లాడే కార్యకర్తలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీతో కాంగ్రెస్‌కు పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ పట్టణంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. రైతులకు నష్టం చేసే మూడు నల్ల చట్టాలకు పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్‌ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనని, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందనే టిఆర్‌ఎస్‌కు బిజెపి మద్దతిస్తుందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి బిజెపి నాయకులు రిమోట్‌ కంట్రోల్‌తో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ జరపరని ప్రశ్నించారు. ఆదివాసీల పది శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. వారి కోసం సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌కు రెండుసార్లు అవకాశమిచ్చి మోసపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఒక అవకాశమిస్తే తెలంగాణ కలలు నిజం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక రాజులా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలతో ప్రజలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. సభా వేదికకు చేరుకున్న రాహుల్‌గాంధీ… ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన రైతు డిక్లరేషన్‌ను పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సభలో ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిక్లరేషన్‌ అమలు చేస్తామన్నారు. అన్నివిధాలుగా కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.