ధరల పెరుగుదలపై వామపక్షాల నిరసనలు

  • 27న మండల, పట్టణ కేంద్రాల్లో 30న జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు

వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ .23 : ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.

మహబూబాబాద్ పేరుమాండ్ల జగన్నాథం భవన్లో జరిగిన వామపక్షాల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాథుల శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారథి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి హెచ్. లింగ్యా, ప్రజాపందా జిల్లా నాయకులు ఉమ్మగాని సత్యనారాయణ లు మాట్లాడుతూ..

పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు భూముల రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసి ఛార్జీలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి 31 వరకు 3 విడతలుగా అందోళన, పోరాటాలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

దీనిలో భాగంగా ఈ నెల 27న, అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని, 30న,జిల్లా కేంద్రం లో ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్, పప్పులు, మంచినూనె తదతర నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాయని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై విధించిన అన్ని రకాల సెస్లను రద్దు చేసి ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, పెంచిన వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలతోపాటు, బట్టలు, చెప్పులపై జి.ఎస్.టి. తగ్గించాలని, స్టీల్, సిమెంట్, ఇసుక ధరలను అదుపు చేయాలని, దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసరాలను పేదలకు అందించాలని డిమాండ్ చేశారు.

అసంఘటిత రంగ కార్మికులందరికి నెలకు రు.7,500/-లు యివ్వాలని, ఉపాధి హామీ పథకం నిధులు పెంచి, పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని వారు కోరారు. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీచేసి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం రు. 26,000/-లు చెల్లించాలని తెలిపారు. పెంచిన విద్యుత్, ఆర్టీసి బస్ ఛార్జీలు, భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని వామపక్ష శ్రేణులు, ప్రజా సంఘాలు, మేధావులకు, ప్రజాతంత్రవాదులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఆకుల రాజు, సమ్మెట రాజమౌళి,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులువెలుగు శ్రావణ్,ఎం.ఎల్. న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు దేశెట్టి రామచంద్రయ్య, శివరపు శ్రీధర్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే.బాబు,ఇఫ్టు జిల్లా కార్యదర్శి బిల్లకంటి సూర్యం తదితరులు పాల్గొన్నారు.