– ఆసియా ఖండం లోనే అతి పెద్ద జాతర
మేడారం జాతర 2022 : తెలంగాణ మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది. మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ఈ రోజు తెలంగాణ ఆదివాసీ జాతర ప్రారంభమవుతోంది.
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది. మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ఈ రోజు తెలంగాణ ఆదివాసీ జాతర ప్రారంభమవుతోంది. నేటి నుంచి 19వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది. సమ్మక్క, సారలమ్మలను గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో బందోబస్తు ఏర్పాటుపై పోలీసు అధికారులు మాక్‌డ్రిల్ చేశారు. మేడారం మహా జాతరలో మంగళవారం తొలి ఘట్టం జరిగింది. పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారం తీసుకువచ్చే తంతు పూర్తయింది. ఇవాళ సారలమ్మ, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇక ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకొస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తి అవుతుంది.
రేపు 17వ తేదీన సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం. కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టం. చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని, ఆ తల్లికి జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు.