ఆదిలాబాద్ : పిల్లలు పుట్టలేదన్న బాధలో తమ్ముడి కొడుకును దత్తత తీసుకొని పెంచుకున్న ఓ తల్లి.. చివరికి ఆ కసాయి చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది..
పిల్లలు పుట్టలేదన్న బాధలో సోదరుడి కొడుకును పెంచుకున్న ఓ తల్లి.. చివరికి ఆ కసాయి చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది.. ఈ కేసులో హత్యకు పాల్పడిన పెంపుడు కొడుకుకు జీవితఖైదును కోర్టు విధించింది.. అలాగే రూ.10 వేల జరిమానా కట్టాలని పేర్కొంది.వివరాల్లో వెళ్తే.. దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామానికి చెందిన భీమన్న గంగవ్వ దంపతులకు సంతానం లేదు. కాగా వీరి తమ్ముడైన ఎర్రన్న కొడుకు బద్ది భీమేశ్‌ను 10 ఏళ్ల వయసులో దత్తతకు తీసుకున్నారు. భీమేశ్‌కు బట్టాపూర్ గ్రామానికి చెందిన శ్రీలతతో పెళ్లి జరిపించారు. అయితే వీరి పెళ్లికి ముందే తండ్రి భీమన్న మృతి చెందాడు. ఈ క్రమంలోనే భీమేశ్ తాగుడుకు బానిసయ్యాడు. పెంపుడు తల్లి గంగవ్వ పేరిట ఉన్న అర ఎకరం భూమిని అమ్మి తాగుడుకు ఖర్చు చేశాడు..
అలాగే తల్లి పేరిట ఉన్న ఇల్లు, మరో అర ఎకరం భూమిని కూడా అమ్మాలని రోజూ భీమేశ్ గొడవ పడేవాడు. ఇందుకు పెంపుడు తల్లి నిరాకరిస్తూ వచ్చింది.. ఈ నేపథ్యంలోనే ఆస్తిని అమ్మేందుకు అడ్డు వస్తున్న పెంపుడు తల్లిని చంపాలనుకున్న భీమేశ్.. 2017 అక్టోబర్ 10వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో టెలిఫోన్ వైరుతో ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు దస్తూరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
దీంతో పోలీసులు కేసును విచారించారు. భీమేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అప్పట్నుంచి విచారణలో ఈ కేసులో 16 మంది సాక్షులను ఏపీపీ కె.వినోద్‌రావు కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా ఏడో అదనపు న్యాయమూర్తి.. నేరస్తుడైన భీమేశ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే రూ.10 వేల జరిమానాను కూడా విధించారు..