హెల్మెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇక నుంచి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్న పిల్లలు సైతం హెల్మెట్లు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు పిల్లలకు తగ్గట్టుగా హెల్మెట్లను తయారు చేయాలని తయారీదారులను కోరింది. దీనిని పాటించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించడంతో పాటు మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు.
ద్విచక్ర వాహనాలపై వెళ్లే పిల్లల భద్రత, హెల్మెట్ ధారణకు సంబంధించి ప్రజాభిప్రాయం కోరుతూ కేంద్రం గతేడాది అక్టోబర్ లో ఒక డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ద్వారా సవరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది.
పిల్లలను తీసుకెళ్లే వాహనాలను గంటకు 40 కిలో మీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి. వాహనాలపై వెళ్లే పిల్లల భద్రతా రీత్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ నిబంధనను కూడా అందరూ పాటించాలి. వాహనాలపై వెళ్లే చిన్నారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. ఈ విషయంపై పౌరుల అభిప్రాయాన్ని అడగడానికి అక్టోబర్ 2021లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది పిల్లలకు హెల్మెట్‌ను తప్పనిసరి చేసింది.