- మంచిర్యాల నియోజకవర్గం సీసీ గెస్ట్ హౌస్‌లో ముప్పు ప్రాంతాల పై జిల్లాస్థాయి సమీక్ష
- సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వివారిస్తాo
మహా వెలుగు మంచిర్యాల 16 : ఇది అత్యంత బాధాకరమైన సంఘటనని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు, గోదావరి, ప్రాణహిత నదుల ముంపు గ్రామాలపై ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం సీసీ గెస్ట్ హౌస్‌లో జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ… చెన్నూర్ నియోజకవర్గంలోని దొరచెరువు, చింతలకుంట చెరువు, పెద్దచెరువు, ఊర చెరువు, బంటోనికుంట చెరువు, గొల్లవాగు కాలువ కు సంబంధించి ఎలకేశ్వరం-ఓత్కులపల్లి గ్రామాల వద్ద మరమ్మతులు, ఎర్రగుంట చెరువు, టేకులకుంట చెరువు మరమ్మతులకు ఇరిగేషన్ శాఖ నుంచి రూ.66లక్షల నిధులు అవసరమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు వారు తెలిపారు.

చెన్నూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదలతో కోతకు గురైన రోడ్లు, చెక్ డ్యామ్స్ మరమ్మతులకు ఆర్అండ్‌బీ శాఖ నుంచి రూ.1.75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.50లక్షల నిధులు అవసరమని అంచనా వేశారు. అవసరమైతే నిధులకు సంబంధించి పునః సమీక్షించనున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి ఆస్తి నష్టం వివరాలను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వివరిస్తామన్నారు.

అత్యధిక వర్షపాతం కలిగిన జిల్లా కాబట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రిని విప్ సుమన్ కోరారు.
నదీపరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎగువన ఇండ్ల స్థలాలు ఇవ్వడం, కరకట్టలు కట్టడం, చెరువులు, వాగుల బ్యాక్ వాటర్ ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అవసరమైన రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించి అధికారులు నివేదిక అందించాలని కోరారు.
జిల్లాలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ , ఎమ్మెల్యే లు నడిపల్లి దివాకర్ రావు , దుర్గం చిన్నయ్య , కలెక్టర్ భారతి హోళి కెరీ తదితరులు పాల్గొన్నారు.
