కేసీఆర్-ఉద్ధవ్ థాకరే జాయింట్ స్టేట్‌మెంట్ ఇదే
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టానికి తెర లేచింది. మూడో కూటమి దిశగా సుదీర్ఘ కాలంగా తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ దిశగా ముందడుగు వేశారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ఆయన సమావేశం అయ్యారు. దీనికోసం ఆయన ముంబైకి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే- ఉద్ధవ్ థాకరే సహా శివసేనకు చెందిన కీలక నేతలను కలుసుకున్నారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్, ఉద్ధవ్ థాకరేతో పాటు శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్, కొందరు మహారాష్ట్ర మంత్రులు ఇందులో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కావడం, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది క్లుప్తంగానే..
ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. క్లుప్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ముగించారు. ఉద్ధవ్ థాకరేతో జరిగిన భేటీ ఓ తొలి అడుగు మాత్రమేనని, ఇంకా చాలా దూరం నడవాల్సి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పలువురు జాతీయ స్థాయి నాయకులను కలుసుకోవాల్సి ఉందని అన్నారు. అనేక విషయాల్లో తామిద్దరం ఏకాభిప్రాయానికి వచ్చామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తన అభిప్రాయాలతో ఉద్ధవ్ ఏకీభవించడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణకు రావాల్సిందిగా ఉద్ధవ్ థాకరేను ఆహ్వానించానని, దీనికి ఆయన అంగీకరించారని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రీయ దర్యాప్తు సంస్థల అధికారాలు దుర్వినియోగమౌతున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని ఉద్ధవ్ థాకరే కూడా వ్యక్తం చేశారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రీయ దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై రాజ్యాంగబద్ధమైన సంస్థలను ప్రయోగించడం సరికాదని చెప్పారు.ఏజెన్సీల అధికారాలు దుర్వినియోగం..
సీబీఐ, ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీల అధికారాలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. తన వైఖరిని మార్చుకోక తప్పదని కేసీఆర్ స్పష్టం చేశారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే- అందుకు తగ్గట్టే ఫలితాలను చవి చూడక తప్పదని హెచ్చరించారు. ఉద్ధవ్ థాకరేతో సమావేశం ముగించుకున్న అనంతరం కేసీఆర్ నేరుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. సుప్రియా సులే ఈ భేటీలో పాల్గొన్నారు.