తెలంగాణ ప్రభుత్వం ,గవర్నర్ మధ్య ప్రోటోకాల్ వివాదం ..

హైదరాబాద్‌/వెలుగు ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ప్రొటోకాల్‌ వివాదం ముదురుతోంది. మేడారం జాతరలో గవర్నర్‌ తమిళిసైకి ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉన్నా, వారు గైర్హాజర్‌ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది. మేడారం ముగింపు రోజు శనివారం ఉదయం 11.15 నిమిషాలకు గవర్నర్‌ మేడారం వెళ్తారని, హెలికాప్టర్‌ సమకూర్చాలని గవర్నర్‌ కార్యాలయం కోరినా, దానిని సమకూర్చకపోవడంతో గవర్నర్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి చేరుకున్నారు.

అయితే అదేరోజు కాస్త ముందుగా సీఎం కేసీఆర్‌ జాతరకు వెళ్తున్నారని, ప్రభుత్వం వద్ద ఉన్నది ఒక హెలికాప్టర్‌ మాత్రమేనని, అందుకే దానిని సమకూర్చలేమని ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సీఎం హెలికాప్టర్‌లో మేడా రం వెళ్తారనే సమాచారం ముందుగానే ఇచ్చారని, ఆ తర్వాతే గవర్నర్‌ కార్యాలయం హెలికాప్టర్‌ కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. చివరికి గవర్నర్‌ రోడ్డుమార్గంలో మేడారానికి వెళ్లిన విషయం తెలిసిందే. గవర్నర్‌ కార్యాలయం ముందు ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటు చేయడం, కోవిడ్‌ పేరుతో జనవరి 26 వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేయడం వంటి విషయాలపై ప్రభుత్వం, గవర్నర్‌కు మధ్య విభేదాలు పొడచూపాయి.