అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్‌ .. వీడియో వైరల్‌

అర్ధరాత్రి నడిరోడ్డుపై అత్యంత ప్రమాదకరంగా ఆటోలతో విన్యాసాలు(స్టంట్స్‌) చేస్తూ.. పెద్దపెద్దగా కేకలు వేస్తూ తోటి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తూ.. తోటి వాహనాలు, లారీని ఓవర్‌ టేక్‌ చేస్తూ.. భయంకరంగా వ్యవహరించిన ఆరుగురు యువకులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ వివరాల ప్రకారం..

టోలిచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్‌ జుబేర్‌ అలీ(20), సయ్యద్‌ సాహిల్‌(21), మహ్మద్‌ ఇబ్రహీం(22), మహ్మద్‌ ఇనాయత్‌(23), గులాం సైఫ్‌ద్దీన్‌(23), మహ్మద్‌ సమీర్‌(19), అమీర్‌ ఖాన్‌(20) అద్దెకు ఆటోలను నడుపుతుంటారు. గురువారం అర్ధరాత్రి మూడు ఆటోలతో చాంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు. చాంద్రాయణగుట్ట నుంచి రాత్రి 12.30 గంటలకు బాబానగర్‌ మీదుగా డీఆర్‌డీఎల్‌ సిగ్నల్‌ వద్ద యూటర్న్‌ తీసుకొని తిరిగి బాబానగర్‌ వైపు పయనమయ్యారు.

మూడు ఆటోలను ఒళ్లు గగుర్పొడిచే రీతిలో రెండు టైర్లపై క్రాస్‌గా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురిచేశారు. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలిగించారు. రోడ్లపై వీరు చేసిన స్టంట్స్‌ను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.మరో ఆటోతో పాటు డ్రైవర్‌ మహ్మద్‌ ఇబ్రహీం పరారీ ఉన్నాడు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్‌స్పెక్టర్‌ ఎ.మధుసూదన్‌రెడ్డి, ఎస్సైలు గౌస్‌ఖాన్, గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు.