మహా వెలుగు ప్రతినిధి మహబూబాబాద్, ఏప్రిల్-08: ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపిటిసి, వార్డ్ ల స్థానాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపిటిసి, వార్డ్ ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించుటకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో ఆరు సర్పంచ్ స్థానాలు బయ్యారం మండలం లోని ఇర్సులాపురం, జగత్ రావు పేట, కేసముద్రం మండలం లోని ఉప్పరపల్లి, నెల్లికుదురు మండలం లోని నైనాల, గూడూరు మండలంలోని లైన్ తండా, కురవి మండలం లో గుండ్రాతిమడుగు లలో ఏర్పడిన ఖాళీలకు గాను, ఎంపీటీసీ నాలుగు స్థానాలు బయ్యారం మండలం కొత్తగూడెం, ఉప్పలపాడు, దంతాలపల్లి మండలం లో పెద్దముప్పారం, చిన్న గూడూరు మండలం లో విస్సంపల్లి, అలాగే జిల్లా వ్యాప్తంగా 62 వార్డులకు ఎన్నికలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ నెల 8న ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రకటించి అభ్యంతరాలను ఈ నెల 16 వరకు స్వీకరించి, 19 వరకు వాటిని పరిష్కరించాలని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా పై ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులు పరిశీలించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 21 నాటికి తుది ఓటరు జాబితాను తయారు చేసి నోటిఫైచేయాలని, 23న డిస్ప్లే చేయాలని సూచించారు.
జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తుది ఓటర్ల జాబితా పై సమావేశం ఏర్పాటు చేయాలని, ఎన్నికల సామాగ్రి వివరాలను పరిశీలించుకోవాలి అని, జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పేపర్ ముద్రించడానికి అనువైన ప్రింటింగ్ కేంద్రాలను గుర్తించాలని ఆయన సూచించారు. బ్యాలెట్ బాక్స్ లను పరిశీలించుకొని సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి, డి.పి. ఓ. సాయిబాబా, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలు, కలెక్టరేట్ ఎలక్షన్ సూపర్డెంట్ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
