జూపల్లి ఇంటికి మంత్రి కేటీఆర్

మహా వెలుగు, నాగర్‌కర్నూల్‌ 18 : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. ఇవాళ(శనివారం) నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళ్లిన ఆయన.. మాజీమంత్రి జూపల్లి ఇంటికి వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. 

జూపల్లి ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..  కొల్లాపూర్‌లో పార్టీ పరిస్థితి, గ్రూప్‌ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు జూపల్లి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారనే వార్త జోరుగా షి‘కారు’ చేస్తోంది. అయితే శనివారం నాటి కేటీఆర్‌ పర్యటనకు సైతం జూపల్లి దూరంగా ఉండడంతో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌, జూపల్లి ఇంటికి వెళ్లారనే చర్చ నడుస్తోంది. 

మాజీ మంత్రి జూపల్లితో కలిసి తేనేటి విందులో మంత్రి కేటీఆర్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు. జూపల్లికి, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మధ్య విభేధాలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే పార్టీ మారకుండా నిలువరించడంతో పాటు టీఆర్‌ఎస్‌లో వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకే కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది.