కేసీఆర్ పది వేల కోట్లు ఇస్తాడని పీకే నాతో చెప్పాడు: కేఏ పాల్

ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మే 28న పరేడ్ గ్రౌండ్స్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అరవింద్‌ కవితను ఓడించినట్లే కేసీఆర్‌, కేటీఆర్‌ను కూడా ప్రజలు ఓడిస్తారని అన్నారు. కేసీఆర్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 10 యుద్ధాలు ఆపానని, కోదండరాంను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆలోచించి చెపుతానని కోదండరాం చెప్పినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నానని చెప్పారు. మళ్ళీ తాను సిరిసిల్ల వెళ్తానని స్పష్టం చేశారు.

బంగారు తెలంగాణను చేసేంత వరకు తాను పోరాటం చేస్తానని తెలిపారు. కేసీఆర్‌కు తాను గతంలో సపోర్ట్ చేశాననన్నారు. తెలంగాణలో మార్పు రావాలని, కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్, చిన్నజీయర్ స్వామి ఎందుకు వదిలేశారో తెలియాలన్నారు. సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్ పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశానని కేఏ పాల్ తెలిపారు. పీకే జాతీయ పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ పది వేల కోట్లు ఇస్తాడని పీకే తనతో చెప్పారని కేఏ పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కడ పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పలేనని కేఏ పాల్ పేర్కొన్నారు