మహా వెలుగు వెబ్ న్యూస్ 12 : తెలంగాణ సీఎం కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉండగా, సరిగ్గా ఆయన పన్నిన వ్యూహాన్నే అమలు చేస్తూ అనూహ్య చర్యకు దిగారు టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వివరాలివే..
జాతీయ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందంటూ గంభీర ప్రకటన చేసిన గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR).. భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉండగా, సరిగ్గా ఆయన పన్నిన వ్యూహాన్నే అమలు చేస్తూ అనూహ్య చర్యకు దిగారు టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Elections 2022) బీజేపీకి షాకిచ్చేలా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు కేసీఆర్ విశ్వప్రయత్నం చేస్తుండగా, ఆ ఉద్దేశంతోనే కీలక సమావేశానికి దీదీ పిలుపునిచ్చారు. అంతేకాదు, సదరు సమావేశానికి సీఎం కేసీఆర్ ను సైతం ఆమె ఆహ్వానించారు. తద్వారా ఎట్టకేలకు బీజేపీ వ్యతిరేక శక్తిగా టీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో తొలిసారి గుర్తింపు లభించగా, అదే సమావేశానికి సోనియాను సైతం దీదీ ఆహ్వానించడంతో కేసీఆర్ వెళతారా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. పూర్తి వివరాలివే..
కేసీఆర్ ప్లాన్ హైజాక్? : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్త జాతీయ పార్టీని స్థాపించబోతున్నట్లు గులాబీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై కేసీఆర్ ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల ప్రతినిధులతో మంతనాలు జరపడం తెలిసిందే. తన సారధ్యంలోనే విపక్ష నేతల సమావేశం ఢిల్లీలోగానీ, హైదరాబాద్ లో గానీ జరుగుతుందని కేసీఆర్ గతంలో చెప్పగా, సరిగ్గా అదే అంశం అజెండాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక భేటీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె శనివారం నాడు 22మంది విపక్ష నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్ తలపెట్టిన సమావేశాన్ని మమత నిర్వహిస్తుండటంతో ఆయన ప్లాన్ ను దీదీ హైజాక్ చేశారా? అనే చర్చ జరుగుతోంది.