ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్ర తదితరాలకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ నడుమ శని, ఆదివారాల్లో కీలక భేటీలు జరిగాయి. ముఖ్యమంత్రి సూచన మేరకు శనివారం సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు, గజ్వేల్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను సందర్శించిన పీకే, ఆ తర్వాత కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తిరిగి ఆదివారం ఉదయం కూడా ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రితో పీకే భేటీ కొనసాగినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.
గతంలో ‘గుజరాత్‌ మోడల్‌’అంటూ అక్కడి అభివృద్ధిపై చేసిన విస్తృత ప్రచారం మోదీ, బీజేపీకి దేశవ్యాప్తంగా మేలు చేసిన విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో గుజరాత్‌ను మించి, దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ ఆశించిన రీతిలో వాటిని ప్రచారం చేసుకోలేకపోతుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘తెలంగాణ మోడల్‌’పేరిట ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించాలని కేసీఆర్‌ భావిస్తున్న నేపథ్యంలో దేశంలో ‘తెలంగాణ మోడల్‌’ప్రచారానికి నిర్ణయం తీసుకున్నారు. 

దిద్దుబాటుపైనా పీకే సూచనలు

టీఆర్‌ఎస్‌ పార్టీతో జట్టు కట్టిన ప్రశాంత్‌ కిషోర్‌ బృందం కొద్దిరోజులుగా రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు, సంస్థాగతంగా టీఆర్‌ఎస్‌ పరిస్థితిని మదింపు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావాన్ని కూడా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు చేసిన సర్వేల వివరాలు, చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై తన అభిప్రాయాలను సీఎంతో పీకే పంచుకున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌కు ప్రాచుర్యం కల్పించడానికి (ప్రొజెక్ట్‌ చేయడం) మరికొన్ని సూచనలు కూడా పీకే చేశారు. కాగా రాబోయే రోజుల్లోనూ వ్యూహరచనకు అవసరమైన సమాచారం కోసం ప్రశాంత్‌ కిషోర్‌ క్షేత్ర స్థాయిలో అడపాదడపా పర్యటించే అవకాశముందని సమాచారం. ఇటీవలి ముంబై పర్యటనలో కేసీఆర్‌ వెంట ఉన్న సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా పీకే, సీఎం సమావేశంలో పాల్గొన్నారు.