కులదురహంకార హత్యపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి

కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్. :

హబూబాబాద్/గార్ల 19 : యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భార్గవి అనే అమ్మాయి భర్త రామకృష్ణ గౌడ్ ను 10 లక్షల సుపారీ ఇచ్చి అతి కిరాతకంగా హత్య చేయించిన సొంత మామ వెంకటేష్ ను కఠినంగా శిక్షించేందుకు తక్షణం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూక్య హరి నాయక్ డిమాండ్ చేశారు.

మంగళవారం గార్ల మండల కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరి నాయక్ మాట్లాడుతూ ‘ఎక్కువ కులం తక్కువ కులం’ అంటూ ఉన్మాదంతో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణ గౌడ్ ను సభ్యసమాజం తలదించుకునేలాగా సొంత మామ వెంకటేష్ 10 లక్షలు సుపారి ఇచ్చి చంపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ఈ సంఘటన పట్ల యావత్ సమాజం స్పందించి ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లనే భువనగిరి ప్రాంతంలో యదేచ్ఛగా కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్ర లో 70 కి పైగా కుల దురహంకార హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు మనువాద భావజాలాన్ని ప్రజల్లో వ్యాపింపజేసి ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు వీరన్న,ఫుల్ సింగ్,రాజా, ప్రశాంత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.