- జనగామ జిల్లా పెద్దపహాడ్ లో ఘటన
- ప్రాణం పోయాక రాజీకి వచ్చిన కుల పెద్దలు
- కుల పెద్దల్ని శిక్షించాలని పలువురి డిమాండ్
మహా వెలుగు , జనగామ 07 : తెలిసి తెలియని కుల పెద్దల మనుషుల పంచాయతీ పేరిట ఒక్క నిండు ప్రేమికుడు బలి కాగా కుల పెద్దల తీర్పు , ప్రేమపై విషం చిమ్మింది.. ఫలితంగా అవమాన భారం భరించలేక ప్రేమికుడు, అతని తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ప్రేమికుడు సాయి కుమార్ ( sai kumar ) మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా మారింది. ఈ హృదయ విదారక ఘటన జనగామ జిల్లా పెద్దపహాడ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే … జనగామ మండలం పెద్దపహాడ్ కు చెందిన దండు సాయికుమార్
(Dandu saikumar )(24) ఇదే మండలం గోపిరాజు పల్లికి చెందిన పురుమ భాగ్య (puruma Bhagya premikuralu) ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడం తో ఇంట్లో తెలుపగా పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. కాగా వారు ఇంట్లో నుండి వెళ్లిపోయి మే 13 వ తేదీన వివాహం చేసుకున్నారు.
అనంతరం భువనగిరి (Bhuvana giri) పట్టణంలో నివాసం ఉంటూ అన్యోన్యంగా కలిసి ఉంటున్న క్రమంలో పెద్దలు వీరి పాలిట గద్దలుగా మారారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో తల్లి తండ్రులు, కుల పెద్దలు ఘనంగా వివాహం చేస్తామని గ్రామానికి పిలిపించుకున్నారు.
వారి మాటలు నమ్మిన ప్రేమికులు సాయికుమార్, భాగ్యలు గ్రామానికి వచ్చారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.కుల పెద్దలు భాగ్య పేరిట షూరిటీ కోసం వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని తీర్మానించారు.
ఇందుకు సాయికుమార్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఆ తర్వాత కుల పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించారు. కానీ పురుమ భాగ్య తల్లిదండ్రులు కడుపులో విషం దాచుకొని అక్కడ గ్రామస్తులు సైతం భాగ్యకు మరో వివాహం చేయాలని నిర్ణయించి ఆమెను సాయికుమార్ వద్దకు పంపడానికి నిరాకరించారు.
నాలుగు నెలలుగా సాయికుమార్ భాగ్యాలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భాగ్య సాయికుమార్ కు ఫోన్ లో పెద్దలు తనకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నారని చెప్పింది. సాయి గా చావైనా.. బ్రతుకైనా.. నీతోనే ఉంటా… నువ్ లేనిది నేను లేను.. నువ్ నాకు కావాలని సాయికుమార్ తో మొరపెట్టుకుంది. దీంతో ప్రేమికుడు సాయికుమార్ మూడు రోజుల క్రితం జనగామ పోలీసులను ఆశ్రయించి తన భార్యకు మరో పెళ్లి చెయ్యాలని కుల పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశాడు.
దీంతో ఈ నెల 7న పోలీసులు వారిని పిలిపించి వాస్తవాలు విచారించే క్రమంలో కులపెద్దలు పెట్టిన పంచాయితీ చిచ్చు సాయికుమార్, అతని తల్లి అక్కమ్మలను తీవ్రంగా కలిచివేసేలా చేసింది. విధిలేని పరిస్థితిలో సాయికుమార్ తల్లి అక్కమ్మ తొలుత పురుగుల మందు తాగింది. ఆ తరువాత సాయికుమార్ కూడా పురుగుల మందు తాగాడు. వారిద్దరిని వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సాయికుమార్ మృతిచెందగా అతని తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కుల పెద్దలు ఘనంగా వివాహం చేస్తారని ఇంటికి పిలిపించి 4 నెలలుగా తన భర్తను ఇబ్బందులకు గురిచేశారని, దీంతో పురుగుల మందు తాగాడని పురుమ భాగ్య కన్నీరుమున్నీరుగా విలపించింది.
పెద్దమనుషుల పంచాయతీ పట్టింపులకు పోతే ప్రాణం పోయేలా చేసిందని పెద్దమనుషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు స్థానికులు కోరుతున్నారు.
