మీకు లోన్ కావాలా మా కాల్ చేయండి

  • ఆదివారం , సోమవారం , బుధవారం , గురువారం , శుక్రవారం ,శనివారం లోన్లు కావాలా అయితే మాకు కాల్ చేయండని అమాయక ప్రజల అవసరాల్ని ఆసరా చేసుకున్న దళారులు ఇంటింటి తిరిగి లోన్లు ఇస్తున్నారు.

మహా వెలుగు , మంచిర్యాల ప్రతినిధి : కొందరి బాధితుల వివరాల ప్రకారం ఆదివారం , సోమవారం , బుధవారం , గురువారం , శుక్రవారం ,శనివారం లోన్లు ఇస్తామని చెప్పి నమ్మబలుకుతూ ప్రజలను ఇబ్బందులు చేస్తున్నారు చిరు వ్యాపారులను టార్గెట్ గా చేసుకొని వారు వ్యాపారాన్ని సజావుగా కాని చేస్తున్నారు అమాయక ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని ఇంటింటికి తిరిగి లోన్లు ఇచ్చి అధిక మొత్తం వడ్డీని వసూలు చేసుకుంటున్నారు. రోజురోజుకు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి.

ఉదాహరణ ఒక వ్యక్తి రూ 10 ,000 రుణం తీసుకుంటే ముందుగానే వారి దగ్గర రూ. 1500 కట్ చేసుకుని రూ. 8500 వారికి ఇచ్చి మళ్లీ తిరిగి పదివేల రూపాయలను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుండటంతో అధికారులు కూడా పెద్ద సంఖ్యలో మామూలు ముట్టాయని ప్రచారం జోరుగా సాగుతుంది.

భీమారం మండలంలోని పలు గ్రామాల్లో ఈ దందా పెద్ద ఎత్తున సాగుతుండగా వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మంచిర్యాల పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు లైసెన్స్ లేకుండానే ఈ వ్యవహారాన్ని ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు. చెన్నూరు పట్టణానికి చెందిన మరికొంతమంది వ్యాపారులు ఈ దందాను సాగిస్తూ తమకు తోచిన కాడికి దోచుకుంటున్నారు.

వందల మందికి రుణాలు

మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన పలువురు అమాయకులు రుణాలను తీసుకున్నారు. వారి అవసరాలను ఆసరా చేసుకొని అధిక మొత్తంలో వడ్డీని వసూలు చేస్తున్నారు. ఒక లబ్ధిదారుడు రూ.10000 వేల నుండి 50,000 వేల వరకు ఈ రుణాలను తీసుకుంటున్నారు.

భీమారం ఓ కాలనీకి చెందిన మహిళ సోమవారం రుణాలు ఇచ్చే వారి నుండి పదివేల రూపాయలను తీసుకుంది ఆమె తిరిగి చెల్లించడంలో జాప్యం కాగా వారి ఇంటికి వచ్చి బూతులు తిడుతూ అందరి ముందు డబ్బులు కట్టాలని ఆమె పరువును సైతం భంగం కలిగించేలా మాట్లాడారు.

భీమారం మండలంలోని కొత్త గుడిసెలు కాలనీకి చెందిన ఒక మహిళ ఆదివారం లోన్లు ఇచ్చే వారి నుండి రూపాయలు 10000 తీసుకోగా వారిని సైతం అందరి ముందు అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కట్టాలని వారి ఇంటి ముందు కూర్చున్నాడు. ఇలా సోమవారం ఆదివారం గురువారం లోన్లని అమాయక మహిళల అవసరాలను ఆసరా చేసుకొని వారి నుండి పెద్ద సంఖ్యలో వడ్డీని పొందుతూ తిరిగి చెల్లించకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పలువురు మహిళలు పేర్కొంటున్నారు.

ఒక భీమారంలోనే లక్షల్లో వసూళ్లు

ఒక భీమారంలోనే నెలకు లక్షల రూపాయల్లో వసూలు చేస్తున్నారు. అమాయక ప్రజల అవసరాలని ఆసరా చేసుకొని లక్షల రూపాయల్లో డబ్బులను సంపాదిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ వ్యాపారం మూడు పువ్వులుగా ఆరుకాయలుగా జరుగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.