లవ్ సక్సెస్ .. మ్యారేజ్ ఫెయిల్ .. అది తట్టుకోలేక వాళ్లిద్దరూ సూసైడ్

మహ వెలుగు,మెదక్ జూలై 31: బిడ్డల్ని కని పెంచిన తల్లిదండ్రులకు వారి బంగారు భవిష్యత్తు కోసం మంచి బాట వేయాలని మాత్రమే చూస్తారు. కాని వాళ్ల బతుకులు చిందరవందర అయితే భరించలేరు. ముఖ్యంగా కుర్ర వయసులో ఉండే అబ్బాయి, అమ్మాయిలు ప్రేమ(Love) పేరుతో మానసికంగా కుంగిపోవడం చూస్తూ ఏ తల్లి తట్టుకోలేదు. మెదక్ జిల్లాలో కూడా అదే జరిగింది. ప్రేమ పేరుతో తన 20ఏళ్ల కొడుకు దూరమైపోవడాన్ని భరించలేకపోయింది ఆ తల్లి. అందుకే బిడ్డలేని జీవితం ఎందుకని బలవన్మరణాని కి పాల్పడింది.

రెండు ప్రాణాలు తీసిన ప్రేమ..

మెదక్ జిల్లాలో ప్రేమ వ్యవహారం రెండు ప్రాణాల్ని బలిగొంది. మూడ్రోజుల క్రితం రామాయంపేటకు చెందిన కటిక శివకుమార్‌ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు బలవన్మరణం చేసుకోవడంతో తల్లి వరలక్ష్మి తీవ్ర మానసికక్షోభకు గురైంది. కొడుకు శాశ్వతంగా దూరమవడంతో మూడ్రోజులుగా తిండి, నిద్ర లేకుండా కొడుకుని తలచుకుంటూ బ్రతికింది. చివరగా శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో పాండ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం వరలక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. చెరువు కట్టవద్ద చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించగా ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.