మహ వెలుగు జగిత్యాల జూలై 31: భర్తతోపాటు అత్త, మామ, మరిది, ఆడబిడ్డలు, వారి భర్తలు అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ రాజారం సర్పంచ్ మమత పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన దుర్శెట్టి శ్రీనివాస్, భారతి దంపతుల రెండో కుమార్తె మమతను ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన అశోక్‌కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి రజనీకాంత్ (5), హిమశ్రీ (3), దాక్షాయని (10 నెలలు) సంతానం. గత ఎన్నికల్లో మమత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
భర్తతోపాటు అత్త గంగ, మామ శంకర్, మరిది పూర్ణచందర్, ఆడబిడ్డలు ఎదులాపురం వనిత, తునికి అనిత, వీరి భర్తలు ప్రశాంత్, అనిల్ కలిసి అదనంగా రూ.20 లక్షలు కట్నం కావాలని వేధించడంతోపాటు పలుమార్లు మమతపై దాడులు చేశారు. వేధింపులు భరించలేని మమత శనివారం మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంతోపాటు తన వద్దనుంచి భర్త అశోక్ తీసుకెళ్లిన పెద్ద కుమారుడిని ఇప్పించాలని కోరారు. దీంతో ఎస్‌ఐ నవీన్‌కుమార్ నిందితులపై కేసు నమోదు చేశారు.