మహిళలకు, చిన్నపిల్లలకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవ

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తెలంగాణ ఆర్టీసీ టాక్ అఫ్ ది టౌన్ అయింది. తెలంగాణ ఆర్టీసీని సమూల ప్రక్షాళన చేయడానికి నిర్ణయం తీసుకున్న సజ్జనార్ ప్రజలతో సోషల్ మీడియా వేదికగా టచ్లో ఉంటూ ఆర్టీసీ సేవలను మెరుగుపరచడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు, చిన్న పిల్లలకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలను ఇవ్వడానికి, వారికి భద్రతను కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే మార్గాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.

12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రముఖ బస్ స్టాండ్ లలో బేబీ ట్రాలీలు ఇటీవల 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కూడా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా బస్టాండ్ కు వచ్చే మహిళా ప్రయాణికులు చంటి పిల్లలతో ఇబ్బందులు పడకుండా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది ఆర్టీసీ. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెద్దగా ఉన్న బస్టాండ్లలో బేబీ ట్రాలీ లను ఏర్పాటు చేసింది.

చంటిపిల్లలతో, లగేజీతో మహిళలకు బస్ స్టాండ్ లలో ఇబ్బంది; అందుకే బేబీ ట్రాలీలు హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో బేబీ ట్రాలీ లను ఏర్పాటు చేయడంపై రంగారెడ్డి ఆర్ టి సి డిపో మేనేజర్ స్పందించారు. బస్ స్టేషన్ విశాలంగా ఉండడంతో మహిళలు తమ పిల్లలను లగేజీతో పాటు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సర్వీసును ప్రారంభించామని రంగారెడ్డి మేనేజర్ పేర్కొన్నారు. అయితే వీటిని ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికీ ఈ సౌకర్యం ఉంటే బాగుంటుందని అంటున్నారు. మరికొందరు ఎన్ని రోజులు పాటు వీటిని మెయింటెన్ చేస్తారో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.