తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన కుమారుడు కేటీఆర్‌కు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.
మంత్రిగా, పార్టీ నేతల సమర్థవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ మొత్తం ఇప్పుడు కేటీఆర్ అధీనంలో ఉందని చెప్పవచ్చు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు వెల్లడించాయి.
అంతా అయిపోయిందనుకున్న తరుణంలో వాయిదా వేసిన కేసీఆర్
గతంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి రేపో, మాపో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడమే తరువాయి అన్న తరుణంలో అకస్మాత్తుగా కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో అలజడి రేగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతోనే ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారని వార్తలు వచ్చాయి. మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తదనంతర పరిణామాల్లో ఈటెల మంత్రి పదవి కోల్పోవడం, బీజేపీ తీర్థం పుచ్చుకోవడం, హుజూరాబాద్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.
దసరాకు ముహూర్తం
కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీష్ రావు కూడా సమర్థుడిగా, అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన్నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనికి దసరాకు ముహూర్తం పెట్టినట్లుగా పార్టీవర్గాలు చెబుతున్నాయి. అన్నింటికీ ముహూర్తాలు చూసుకొనే పని ప్రారంభించే కేసీఆర్ కొడుక్కి ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలంటే సాధారణ ముహూర్తం చూడరని, అందుకే విజయదశమిని ఎంచుకొని ఉంటారని అంటున్నారు.
తెలంగాణలో గాడితప్పిన పాలన
జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి రాష్ట్ర రాజకీయాలను పట్టించుకోకపోవడంతో తెలంగాణలో పాలన గాడి తప్పిందని, ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మారడంతో కొంత వ్యతిరేకత తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ పాదయాత్ర ప్రారంభించాడు. విజయవాడ నుంచి కరీంనగర్ మీదగా హైదరాబాద్ వరకు ఈ యాత్ర సాగబోతోంది. ఇప్పుడు ఈ వార్త ఏపీకన్నా తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది.