మహా వెలుగు, మంచిర్యాల, ఏప్రిల్ 7: జిల్లాలో పలు మండలాల్లో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే పల్లెపోరుకు ఎన్నికల నగారా మోగనుండంతో ఆయా గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థ సారథి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. దీంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గడిచిన రెండేళ్లుగా ఆయా స్థానాలు ఖాళీగా ఉండడంతో ప్రజలు సమస్యలను ఎదుర్కోవడంతోపాటు, అభివృద్ధి పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.
- పలు కారణాలతో..
సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ పదవుల్లో ఉన్న వారు చనిపో వడం, సస్పెండ్ కావడం, రాజీనామాలు చేయడం వంటి కారణాలతో అక్కడక్కడా స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి మళ్లీ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలను నిర్వహించాలని ఏడాది క్రితం ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటరు లిస్టు, అభ్యంతరాల స్వీకరణ తదితర పనులు పూర్తి చేశారు. కాగా కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. తదుపరి కరోనా కొంత మేరకు తగ్గుముఖం పట్టినప్పటికీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపో వడం వల్ల ఎన్నికలు జరగలేదు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పరిమితి మరో రెండేళ్లలో ముగియనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయనుండడంతో ఎట్టకేలకు జిల్లాలో మళ్లీ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో మొత్తం 311 గ్రామ పంచాయతీలకు గాను 2,730 వార్డులు ఉన్నాయి. అందులో 2019లో 308 పంచాయతీల్లోని 2,706 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో వివిధ కారణాలతో పలు స్థానాలు ఖాళీ కాగా, కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించలేదు. ఖాళీ స్థానాలతోపాటు, గతంలో ఎన్నికలు నిర్వహించని వాటిలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ముందుగా ఓటరు జాబితా కోసం షె డ్యూల్ విడుదల చేసి తాజా జాబితాను రూపొందించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసర మైన పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి సిద్ధం చేస్తున్నారు. రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమించే పనులు చేపడుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టీ-పోల్‌లో నమోదు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
- జిల్లాలో ఖాళీలు ఇవే..
జిల్లాలో 367 వార్డు సభ్యులు, 9 సర్పంచ్, 2 ఎంపీటీసీ స్థానాలు ఖాళీ అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు సంబంధించి జిల్లాలోని దండేపల్లి మం డలం నెల్కి వెంకటాపూర్, వందూరుగూడ, గూడెం, కోటపల్లి మండలం కొల్లూరు, సిర్సా, తాండూరు మండలం తాండూరు, కన్నెపల్లి మండలం సాలిగాం, కాసిపేట మండలం ధర్మారావుపేట, వేమనపనల్లి మండలం రాజారాం స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లాలో రెండు ఖాళీ ఉండగా మందమర్రి మండలం చిర్రకుంట, భీమారం మండలం మద్దికల్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చిర్రకుంట ఎంపీటీసీ ఆరిఫ్ విద్యుదాఘాతానికై గురై మృతి చెందగా, మద్దికల్ ఎంపీటీసీ జ్ఞానంపెల్లి సమ్మయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈయన సర్పంచ్‌గా పోటీ చేసిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్‌కు ఎన్నికలు ఖర్చులు సమర్పించనందున ఎంపీటీసీగా ఉన్న ఆయనపై వేటు పడింది. ఆయన మండల వైస్ ఎంపీపీగా కూడా ఉన్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
- ఎన్నికలు జరుగనున్న స్థానాలకు..
జిల్లాలోని పలు పంచాయతీలు, పరిషత్‌లల్లో ఎన్నికలు జరుగనున్న స్థానాల్లో శుక్రవారం ఓటర్ల ముసా యిదా జాబితా విడుదల చేయను న్నారు. 12వ తేదీన కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీలతో జిల్లా స్థాయిలో అవగాహన సమావేశాలు, 13న మండల స్థాయిలో సమావేశాలు నిర్వ హించనున్నారు. అనంతరం 11 నుంచి 16వ తేదీ వరకు ఓటరు జాబి తా పై అభ్యంతాలు స్వీకరిస్తారు. 19వ తేదీన జాబితాలలో తప్పుల సవరణ చేపట్టి 21న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
