- పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొంది ఒకే ఠాణా లో పనిచేస్తున్న అక్కచెల్లెళ్ళు ,పలువురికి ఆదర్శం.
మహావెలుగు దంతాలపల్లి/ఏప్రిల్ 28 : దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన రేబెల్లి సోములు-నాగమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరు కొన్నేళ్ల కిందట రేపోణి నుంచి తొర్రూరుకు వెళ్లారు. ప్రస్తుతం తొర్రూరులోనే స్థిరపడ్డారు.
సోములు నాటు వైద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి మూడో కుమార్తె జ్యోతి. ఈమె ఓపెన్ డిగ్రీ పూర్తి చేశారు. పోలీస్ కొలువు సాధించాలనే ధ్యేయంతో ముందుకు సాగారు. రెండుసార్లు ఎస్సై కొలువును చేజారారు. పట్టు విడవకుండా ప్రయత్నించి 2014లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. శిక్షణ పూర్తి చేసుకుని 2016 నుంచి 2019 వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తించారు.
ఒక ఏడాది ట్రాఫిక్, మరో ఏడాది ఐనవోలులో ఠాణా పరిధిలో పని చేశారు. ఈ ఏడాది జనవరిలో దంతాలపల్లి ఠాణాకు బదిలీపై వచ్చారు. ఎస్సై కొలువు సాధించడమే ధ్యేయంగా ఎంచుకున్నట్లు తెలిపారు.అక్కను చూసి జ్యోతి సోదరి గౌతమి వరంగల్‌లో బీఫార్మసీ చదివారు. తన సోదరిని ఆదర్శంగా తీసుకుని పోలీస్ కొలువు కొట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఇంటి వద్దే ఉండి పరీక్షలకు సిద్ధమయ్యారు. అవసరమైన ఈవెంట్స్‌లో నెగ్గేందుకు సాధన చేశారు. 2014లో సివిల్ కానిస్టేబుల్కుఎంపికయ్యారు.
తొలుత మామునూర్, కమిషనరేట్ పరిధిలో పని చేశారు. 2022 జనవరిలో దంతాలపల్లి ఠాణాకు బదిలీపై వచ్చారు. అక్కాచెల్లెళ్లు కానిస్టేబుళ్లుగా ఒకే ఠాణాలో కలిసి విధులు నిర్వర్తిస్తుండటంతో ఠాణాకు వచ్చిన వారంతా వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.

