పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

మహా వెలుగు 05: కల్లూరు మండలం రఘునాథగూడెం పంచాయతీ కార్యదర్శి గుర్రాల స్వర్ణలత(40) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

ఎస్సై వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అవివాహితైన స్వర్ణలత కల్లూరు అంబేడ్కర్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో తల్లితో మాట్లాడారు.

ఆదివారం ఉదయం 8.30 నుంచి ఆమె తల్లి సుగుణమ్మ కుమార్తెకు ఎన్నిసార్లు ఫోనుచేసినా తీయకపోవడంతో 11.30కు ఇంటి యజమాని రామారావుకు ఫోన్‌చేసి ఆమె ఇంట్లో ఉందా లేదా చూసి చెప్పమన్నారు. రామారావు పిలిచినా పలకకపోవడంతో కిటికీలోంచి చూడగా మంచంపై స్వర్ణలత చలనంలేని స్థితిలో ఉంది. దీంతో కుటుంబీకులకు తెలపడంతో వారు హుటాహుటిన కల్లూరు చేరుకున్నారు. స్వర్ణలత పురుగుమందు తాగి మృతిచెందినట్లు గుర్తించి ఆమె సోదరుడు రాజ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పెనుబల్లి వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తరలించారు.