ఇది కలియుగంలో ఇలా కూడా ఉందా ? తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో నంబర్ వన్ అని పాలకులు , అధికారులు చెప్తున్న అది మాత్రం ఆచరణ మాత్రం చూపడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఓ పచ్చి బాలింత 10 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. పచ్చి బాలింత ఇలా నడిచి ఇంటికి చేరుకున్న ఘటన కలకలం రేపింది.
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన నాయకపుగూడ గ్రామంలో సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేవు. గోవెన నాయకపుగూడ గ్రామానికి చెందిన నాగమ్మ- పరమేశ్ దంపతులకు రెండో సంతానంగా అమ్మాయి పుట్టింది. ప్రసవం కోసం నాగమ్మ నిర్మల్ జిల్లాలోని పుట్టింటికి వెళ్లగా అయిదురోజుల క్రితం ఆడపిల్ల జన్మించింది.
గురువారం ప్రత్యేక వాహనంలో నిర్మల్ నుంచి ఆసిఫాబాద్ వరకు, అక్కడి నుంచి బలాన్పూర్ వరకు రాగలిగారు.
బలాన్పూర్ నుంచి గోవెన నాయకపుగూడ పది కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా ఆ వాటి మధ్యలో రెండు చిన్నపాటి కొండలు, వాగులు దాటాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు కూడా అతికష్టం మీద ఆ గ్రామాల గుండా వెళ్తాయి. ఈ నేపథ్యంలో బాలింత నాగమ్మ గురువారం దగ్గరి బంధువు సాయంతో పది కిలోమీటర్లు నడిచి అత్తవారింటికి వెళ్లగలిగింది. బాలింత ఇలా 10 కిలో మీటర్లు నడిచి వెల్లడంతో పలువురు ప్రభుత్వ తీరును, అభివృద్ధిని ఎండగడుతున్నారు. దీనిపై విచారణ చేపట్టి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నారు.
