అమ్నీషియా పబ్‌ కేసు: ఫొటోలు, వీడియోలు మా దగ్గర..ఉన్నాయి ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడు: రఘునందన్‌రావు

మహా వెలుగు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ అత్యాచార కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మైనర్‌పై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో పోలీసుల తీరుపై బీజేపీ మండిపడుతోంది. ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని, అయినా పోలీసులు అరెస్ట్‌ను ఎందుకు చూపించడం లేదంటూ నిలదీస్తోంది

మైనర్‌పై సామూహిక అత్యాచార కేసులో.. పోలీసులు లీకులు ఇచ్చారే తప్ప అరెస్టులు చేయలేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో పోలీసులే జడ్జ్‌మెంట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

బాధితుల తరపున మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. మమ్మల్ని కాదు.. తప్పులు చేసిన వారిని అరెస్ట్‌ చేయండి. అసలు నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని రఘునందన్‌రావు, పోలీసులను నిలదీశారు. సామూహిక ఘటనలో నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్‌గా ఉంచారు? అరెస్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.

పొటోలు, వీడియోలు మా వద్ద ఉన్నాయి. రెడ్‌ కలర్‌ కారులో ఉంది ముమ్మాటికీ ఓ ఎమ్మెల్యే కొడుకే!. నిందితుల ఫొటోలను ఎందుకు రహస్యంగా ఉంచారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం. హైదరాబాద్‌లో పోలీసింగ్‌.. మజ్లిస్‌ చేతిలో ఉంది. కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. సీబీఐతో లేదంటే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితోనైనా విచారణ జరిపించాలి. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందే.

రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కారులో రొమేనియాకు చెందిన మైనర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. కాలేజీ పార్టీకని వెళ్లిన బాధితురాలిని.. పబ్‌ నుంచి ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు నిర్మానుష్యమైన గల్లీల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆందోళనకు లోనైన బాలిక ముభావంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం.. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో ఈ దారుణం బయటపడింది.