మహా వెలుగు, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్ పూర్ మానేరు ప్రాంత రైతులు నిలదీసిన రైతులకు ఒక రేటు…అడిగి నిలదీయని అమాయక రైతులకు ఒక రేటు ఇచ్చి మానేరు ఇసుక క్వారీ నిర్వాహకులు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు రైతులు గురువారం గోపాల్ పూర్ మానేరు ఇసుక క్వారీ వద్ద జరుగుతున్న పనుల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. మంథని నియోజకవర్గ పరిధిలోని మానేరు,గోదావరి నదుల్లో డిసల్టేషన్ పేరిట 2014 నుండి ఈ ప్రాంతంలో ఇసుక రవాణా జరుగుతుందని ,అందుకు గాను నదుల్లో నుండి ఇసుకను తరలించడానికి అవసరమైన స్టాక్ పాయింట్లు, రోడ్ల మార్గం కొరకు,మట్టి రవాణా కొరకు,దుమ్ము పడి పంట నష్టపోయే రైతులకు భూముల లీజు పేరిట టి.ఎస్. ఎం.డి.సి. నిబంధనల మేరకు ఎకరాల,గుంటల చొప్పున నష్ట పరిహారం పేరిట అగ్రిమెంట్ చేసుకొని ఇసుక రవాణా కొనసాగుతుందని తెలిపారు.కాగా మంథని మండలం లోని మానేరు నదిలో నుండి ఇసుకను తరలించడానికి గాను గతంలో వెంకటాపూర్ ఇసుక క్వారీ ప్రాంతంలో ఏడాదికి గుంటకు రూ.2500 వందల చొప్పున ఎకరానికి ఒక లక్ష రూపాయలు రెండు పంటలకు గాను చెల్లించడానికి పలువురు రైతులతో కాంట్రాక్టర్లు బాండ్ పేపర్లు రాయించుకొని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని , అదేవిధంగా మొన్నటి అడవి సోమన్ పల్లి మానేరు ఇసుక క్వారీ వద్ద కూడా అదే రీతిగా ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వడానికి అగ్రిమెంట్లు సదరు కాంట్రాక్టర్లు తీసుకున్నారని తెలిపారు.
అయితే ఇటీవల మంథని డివిజన్ లోని ముత్తారం,మంథని మండలాల్లోని మానేరు నదిపై 5 ఇసుక క్వారీ ల ఏర్పాటు కు టెండర్లు నిర్వహించారని. కాగా టెండర్లు పొందిన కొంతమంది కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారి రైతులకు అన్యాయం చేయడానికి గాను రేట్లు తగ్గించి భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఎకరానికి ఆరు నెలలకు గాను రూ.30 వేల చొప్పున ఏడాదికి రూ.60 వేలు మాత్రమే చెల్లించడానికి ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్లు రాసుకొని సంతకాలు పెట్టిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రెండు ఏండ్ల కింద తక్కువ రేట్లకు భూములు లీజుకు తీసుకున్నారని, ప్రస్తుతం వాటిపై ఇంకా అదనపు రేట్లు పెంచి లీజు తీసుకొని ఉంటారని భావించిన అన్నదాతలకు ఇసుక క్వారీ రవాణా నిర్వాహకులు తక్కువ రేట్లకు లీజు ఇస్తున్న తీరు ఆశనిపాతంగా మారిందని వారు తెలిపారు. ఈ మేరకు గోపాల్ పూర్ మానేరు తీర ప్రాంత రైతులు ఇసుక క్వారీ పనుల వద్ద తమ డిమాండ్ ను వినిపిస్తూ మెరుగైన లీజు పరిహారం ఇవ్వాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లు,ప్రజా ప్రతినిధులు,గ్రామ రైతులు పాల్గొన్నారు.
