కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఎస్సై వెంకటేశ్వర్, స్థానికుల కథనం ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్ (19) డిగ్రీ చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన నూనె శివ, అనిల్‌లు పని ఉందని చెప్పి, ఈ నెల 18న అతన్ని బైక్‌పై తీసుకెళ్లారు. తర్వాత తరుణ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఈ నెల 19న కాల్వశ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్రమంలో ఆదివారం వెన్నంపల్లి శివారులో ఓ యువకుడి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దామ పద్మ–మొండయ్య దంపతులకు సమాచారం అందించగా.. వచ్చి, తమ కుమారుడిదేనని గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్యకు గురై ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశారు.మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. తరుణ్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టుతోపాటు పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.