టీకాంగ్రెస్‌లో జగ్గారెడ్డి బాంబు.. రేవంత్ అనూహ్య స్పందన

లాబీయింగ్ ద్వారా పదవులు దక్కించుకున్న కొందరు తనపై కోవర్డ్ ముద్రవేస్తే సహించలేకే పార్టీని వీడాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేఖపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

కేంద్రంపై కేసీఆర్ పోరు.. కాంగ్రెస్ తో టీఆర్ఎస్ జతకట్టబోతోందనే ఊహాగానాల హోరులో తెలంగాణ రాజకీయాలు చర్చనీయాంశమైన వేళ.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం పార్టీలో కలకలం సృష్టించింది. ముడుపులు, లాబీయింగ్ ద్వారా పదవులు దక్కించుకున్న కొందరు తనపై కోవర్డ్ ముద్రవేస్తే సహించలేకే పార్టీని వీడాలనుకుంటున్నట్లు సోనియా గాంధీకి రాసిన లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన లేఖ విడుదల చేసిన కొద్దిసేపటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి అంశంపై రియాక్ట్ అయ్యారు..

జగ్గారెడ్డి అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇది తమ కుటుంబ సమస్యగా వ్యాఖ్యానించారు. కుటుంబం అన్నాక ఏన్నో సమస్యలుంటాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని, దీనిని మీడియా పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్నారాయన. జగ్గారెడ్డి ఉందంతం టీ కప్పులో తుపాను లాంటిదని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని పీసీసీ చీఫ్ అన్నారు. అయితే జగ్గారెడ్డి విషయంలో గోతికాడ నక్కల్లాగా వ్యవహరిస్తోన్న టీఆర్‌ఎస్ నేతల ఆటలు సాగబోవని, జగ్గారెడ్డి కోసం టీఆర్ఎస్‌ చేసే ఆలోచనలు అడియాశలవుతాయి, ఈ అంశాన్ని సానుకూలంగా పరిష్కరించుకుని ముందుకెళ్తామని వెల్లడించారు రేవంత్‌రెడ్డి. నిజానికి జగ్గారెడ్డి ఇవాళ రాహుల్ గాంధీకి రాసిన లేఖ ఆసాంతం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడం గమనార్హం బయటి పార్టీల నుంచి సడన్‌గా కాంగ్రెస్ లోకి వచ్చిన వారు.. లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని రేవంత్ రెడ్డిపై పరోక్ష ఆరోపణలు చేశారు జగ్గారెడ్డి. ఎంతోకాలంగా పార్టీ కోసం పనిచేస్తోన్న తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేఖ రాసిన మరుక్షణం నుంచే తాను కాంగ్రెస్ గుంపు నుంచి వేరయ్యానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మరి రేవంత్ చెప్పినట్లు జగ్గారెడ్డి ఇష్యూ టీకప్పులో తుపానులా సమసిపోతుందా? పెనుతుఫానులా పార్టీని ముంచేస్తుందా చూడాలి ఇక,కాంగ్రెస్ కు రాజీనామా విషయంలో వెనుకడుగు ఉండదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే, సొంత పార్టీ నేతలు ఆరోపించినట్లు తాను టీఆర్ఎస్ లోనూ చేరబోనని, స్వతంత్రంగా కొనసాగుతూనే ప్రజాసేవ చేస్తానని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి ఇవాళే రాజీనామా చేద్దామనుకున్నప్పటికీ నిర్ణయం మారబోదన్నారు జగ్గారెడ్డి. రేవంత్ పీసీసీ కాకముందు నుంచీ జగ్గారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ చివరికి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.