కరోనా అంటేనే యావత్ ప్రపంచం వణికింది. ఇప్పుడు ఆ ప్రభావం లేదు కానీ.. ఒక్కో వేవ్ ఒక్కో దేశంలో హడలెత్తించింది. భారతదేశంలో ఇప్పుడిప్పుడు కేసులు లేవు అని ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ మరో పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది. అవును కరోనా పుట్టినిల్లు చైనాలో మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా ఆవిర్భవించిందే.. వుహాన్‌లో అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. మరోసారి భయపడాల్సిన అవసరం ఏర్పడింది.
చాంగ్ చూన్‌లో కొత్త వేరియంట్
చైనా ఈశాన్య నగరం చాంగ్ చున్‌లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోందని తెలుస్తోంది. చాంగ్ చున్‌లో చైనా ప్రభుత్వం పూర్తిగా లాక్ డౌన్‌ను విధించింది. కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. 90 లక్షలు ఉన్న నగరంలో కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. స్థానికులు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆంక్షలు విధించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రమే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. రెండు రోజులకు ఒకసారి మాత్రమే బయటకు రావాలని స్పష్టంచేశారు.
నగరంలో ప్రతి ఒక్కరూ విధిగా మూడు సార్లు కరోనా పరీక్షలను చేయించుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం కాని సేవలను రద్దు చేశారు. ట్రాన్స్‌పోర్ట్ లింకులను కూడా మూసివేశారు. చైనాలో ఆదిలో కొంతమేర కేసులు అధికంగానే నమోదు అయినా.. 2020 మార్చి తర్వాత కేసులు వేగంగా తగ్గిపోయాయి. గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు వస్తున్నాయి.
గ్వాంగ్ డాంగ్, జిలిన్, షాన్ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని సమాచారం. ఆయా ప్రాంతాల్లో పరిస్థితికి తగ్గట్లుగా అధికారులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. కరోనా వెలుగుచూసిన చైనాలో అంతగా నష్టం వాటిల్లలేదు. మిగతా దేశాలు మాత్రం అల్లాడిపోయాయి. ఇప్పుడు అంతా వ్యాక్సిన్ తీసుకొని.. ప్రశాంతంగా ఉండగా.. మరొ కొత్త వేరియంట్ భయాందోళనకు గురిచేస్తోంది.