విద్యార్థుల ఆందోళనల ఎఫెక్ట్​.. బాసర ట్రిపుల్​ ఐటీ సంచలన నిర్ణయం..

మహ వెలుగు, బాసర జూలై 31:
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన జరిగి 15 రోజులు దాటినా.. మెస్‌ కాంట్రాక్టర్లను మార్చలేదని, ఆరోజు తమకు అధికారులిచ్చిన హామీలు నెరవేర్చలేదని బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. మెస్‌లలో ఖాళీ బెంచీలపై కూర్చుని డిన్నర్‌ బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆందోళనలో ట్రిపుల్ ఐటీ E1,E2 కు చెందిన మూడువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 15వ తేదిన ఫుడ్ పాయిజన్ అయితే నాణ్యత లేని మెస్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈనెల 24వ తేది నాటికి డిమాండ్లు పరిష్కరించాలని డెడ్‌ లైన్ విధించారు. ఇవేమి పరిష్కరించకపోవడంతో మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తాజాగా బాసర ట్రిపుల్​ ఐటీ అధికారులు ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మెస్ కాంట్రాక్టర్​ను మార్చాలనే డిమాండ్ తో విద్యార్ధులు శనివారం నాడు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలోమెస్​ వద్ద అల్లర్లు చేస్తూ.. చదువుకునే విద్యార్ధులను అడ్డుకొంటే షోకాజ్​ నోటీసులు జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. షోకాజ్ నోటీసులు జారీ చేసినా కూడా తీరు మారకపోతే వారిని ట్రిపుల్ ఐటీ నుండి భర్తరఫ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.