మహా వెలుగు వరంగల్ : సంచలనం సృష్టించిన వరంగల్ ఎంజీఎం ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది. అంతేకాదు..
సంచలనం సృష్టించిన వరంగల్ ఎంజీఎం పేషెంట్‌పై ఎలుకల దాడి ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా వున్న చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు వైద్యులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, అంతకముందు మంత్రి హరీశ్ రావు సైతం ఎంజీఎం ఘటనపై స్పందించారు. ఈ మేరకు రోగిని ఎలుకలు కొరికిన ఘటన పై విచారణకు ఆదేశిస్తున్నట్టుగా హరీష్ రావు గురువారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకొంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావొద్దని మంత్రి హరీష్ రావు వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు
భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే పేషెంట్ కిడ్నీ వ్యాధితో వారం రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే శ్రీనివాస్ పరిస్థితి బాగా లేకపోవడంతో ఐసీయూ (ICU)లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ చేతులు, కాళ్ల వేళ్ళను ఎలుకలు కొరికాయి ఆసుపత్రిలో చేరిన మొదటి రోజు శ్రీనివాస్ కుడిచెయ్యి వేళ్లను ఎలుకలు కొరికాయి. దీంతో గాయాలపాలైన శ్రీనివాస్ కు వైద్యులు కట్టు కట్టారు. ఆపై మళ్లీ ఈరోజు శ్రీనివాస్ కాళ్లను, ఎడమ చెయ్యి వేళ్ళను ఎలుకలు తీవ్రంగా గాయపరిచాయి దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మళ్లీ వైద్యులు కట్టు కట్టారు.
