మార్చి 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా…

జీవితంలో అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఇంకా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అయితే ఇప్పటికీ అంతర్జాతీయంగా మహిళలు ఇప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా మహిళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. 2022లో ఉమెన్స్ డే థీమ్ ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మానసిక, సామాజిక, ఆరోగ్య శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2022 మార్చిలో ఉమెన్స్ డే థీమ్ ‘‘రేపటి మహిళలు”. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మహిళల విజయాలను గౌరవించడానికి అంకితం చేసిన రోజే ఉమెన్స్ డే.

మహిళా దినోత్సవ చరిత్ర..

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వందేళ్లు దాటినా గొప్ప చరిత్ర ఉంది. 1908 సంవత్సరంలో మహిళలకు తక్కువ పని గంటలు, మెరుగైన ప్యాకేజీ, ఓటు హక్కు కోసం న్యూయార్క్ నగరంలో 15 వేల మంది మహిళలు భారీ ప్రదర్శన చేశారు. మహిళల ఈ డిమాండ్లను అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1910 సంవత్సరంలో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ యొక్క కోపెన్ హాగన్ సమావేశంలో మహిళా దినోత్సవానికి అంతర్జాతీయ హోదా ఇచ్చారు. ఆ సమయంలో మహిళలందరికీ ఓటు హక్కు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

తొలిసారిగా మహిళా దినోత్సవం..

నిజానికి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటి సారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 1913లో రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును అధికారిక సెలవు రోజుగా ప్రకటించారు. మరోవైపు 1917 యుద్ధం వేళ రష్యాలోని మహిళలు ఆహారం-శాంతి కోసం డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా రాజు నికోలస్ జార్ సింహాసనాన్ని వీడారు. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది.

అడ్డంకులను అధిగమించడం..

స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడే వారికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చక్కని వేదిక అని చెప్పొచ్చు. ఈరోజున మహిళలు తమ హక్కుల కోసం ఎంతలా పోరాటం చేశారో.. వారికి ఇంకా అవసరమైన వాటి కోసం గళమెత్తడం, అడ్డంకులను అధిగమించడం, ఒక శతాబ్దానికి పైగా చరిత్రలో వీరికి పెరుగుతున్న బలాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.