– కలెక్టర్ నుంచి పొలిటీషియన్‌గా మారిన వెంకట్రామిరెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టుకు క్షమాపణ చెబుతారని ఏజీ తెలిపారు.
హైదరాబాద్ :సిద్దిపేట కలెక్టర్ గా పనిచేస్తూ రాజీనామా చేసి అధికార పార్టీలో చేరిపోయిన వెంకట్రామిరెడ్డికి హైకోర్టు భారీ షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామంటూ విత్తన డీలర్లను హెచ్చరించిన అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. విత్తనాలు విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సిఫార్సులు చేయించినా వదిలేది లేదని ఆయన హెచ్చరికలు చేశారు. అంతటితో ఆగని ఆయన వరి విత్తనాలు విక్రయిస్తూ దొరికితే సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా షాపులు తెరవనివ్వబోమని ఆయన కరాఖండిగా చెప్పారు. అదే విషయమై ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. విత్తనాలు విక్రయించొద్దని చెప్పడమేంటని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కోర్టు ఆర్డర్ పట్టించుకోనంటున్నారని.. కలెక్టర్ ఏమైనా సుప్రీం కోర్టు కంటే సుప్రీమా అంటూ ఘాటు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కలెక్టర్‌గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు రావడంతో న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపిన ధర్మాసనం వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో ఆయనతో క్షమాపణ చెప్పిస్తామని ఏపీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.