డబ్బు కోసం సొంత మనవళ్లను కిడ్నాప్ చేసిన అమ్మమ్మ

హైదరాబాద్ : డబ్బు కోసం ఓ మహిళ తన సొంత మనవళ్లను కిడ్నాప్ చేసింది. భర్తను కోల్పోయి.. పిల్లలే లోకంగా జీవిస్తున్న కన్న కూతురికి నరకం చూపించింది. కూతురి ఇద్దరు కొడుకులను ఆమెకు కనిపించకుండా చేసి.. డబ్బు ఇస్తేనే.. వదిలేస్తానని బెదిరించింది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మియాపూర్‌ మదీనాగూడలో నివాసముంటున్న రుహీ వైద్యురాలు. పదేళ్ల క్రితం ముదాసర్‌ అలీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఎనిమిది సంవత్సరాల అర్ఫాన్, ఐదేళ్ల అర్హాన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త అలీ ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి ముంతాజ్, అక్క రోషనాతో కలిసి మదీనాగూడలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్తి మీద కన్నేసిన తల్లి, అక్క జనవరిలో ఇద్దరు పిల్లలను తీసుకొని వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తీసుకెళ్లిపోయారు.

అప్పటి నుండి పిల్లలను తల్లి రుహీకి కనిపించకుండా చేశారు. దీంతో రుహీ పిల్లల కోసం సత్తుపల్లి వెళ్లగా అక్కడ బంధువులందరూ ఆమె పై దాడి చేసి కారును సైతం లాక్కొని పంపించేశారు. దీంతో తల్లి, మిగతా కుటుంబ సభ్యులపైన రుహీ బుధవారం రాత్రి  మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

కాగా గురువారం మియాపూర్‌ పోలీసులు రుహీ దగ్గర బంధువైన సలీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితురాలు రుహీ మానసిక పరిస్థితి సరిగా లేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని వారి భవిష్యత్‌ దృష్యా తాము తీసుకెళ్లామని రుహీ తల్లి ముంతాజ్‌ తెలిపారు. పిల్లల అమ్మమ్మగా తమకు సర్వ హక్కులు కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు రుహీ తల్లి ముంతాజ్‌ తెలిపింది. ఆస్తి కోసం తనకు ఆరోగ్యం బాలేదని అబద్దాలు చెబుతున్నారని బాధితురాలు ఆరోపించడం గమనార్హం.