బీజేపీ మందమర్రి టౌన్ ప్రెసిడెంట్ మద్ది శంకర్ రాజీనామా
షోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ప్రకటన
మంచిర్యాల ,మందమర్రి : మాజీ ఎంపీ గడ్డం వివేక్ ప్రధాన అనుచరుడు మద్దిశంకర్ బీజేపీ పదవీ కి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. ఆయన చేసిన ప్రకటన ప్రకారం తెలంగాణా సమాజం పట్ల చిన్న చూపు, వివక్ష చూపుతున్న భారతీయ జనతా పార్టీ విధానాలతో విసిగిపోయి, తెలంగాణా ఆత్మగౌరవానికి బీజేపీలో విలువ లేదని తెలిసి ఆ పార్టీ మందమర్రి పట్టణ బీజేపీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని బీజేపీ నాయకుడు, మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి, జిల్లాకు పార్టీ ఏమీ ఒరగబెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటెత్తుపోకడలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నదన్నారు.
పార్లమెంటులో ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గేలి చేస్తూ తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారని ఆయన గుర్తుచేశారు.ఈ మాటను బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల అతనికి సదభిప్రాయం లేదని అర్థమయిందని శంకర్ తెలిపారు.
అంతేకాకుండా, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బొగ్గు గనుల వేలం పాటలు ఉపసంహరించుకున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, టీఆరెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లు కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కేకే 6 గనులను సింగరేణికి అప్పగించకుండా వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ వాడిగా తాను కూడా జీర్ణించుకోలేకపోయానని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు ఈ బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని మూడు రోజులు సమ్మె చేసినా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరించిందని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా వేధిస్తుండటం కూడా తనను కలచివేసిందన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన చేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీలో మనసు చంపుకొని ప్రజావ్యతిరేకిగా ఉండలేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమమంలో పాల్గొని ఆమరణ దీక్ష కూడా చేసిన తాను తెలంగాణ సమాజ పతనం ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నానని శంకర్ స్పష్టం చేశారు. తనతో పాటుగా బీజేపీ మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులు అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య , పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి దోనుగు రమేశ్, పట్టణ పార్టీ కోశాధికారి మురళి, యువ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు రంగు రమేశ్, బీసీ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్ అధ్యక్షులు బండి రవి, చెల్లేటి తిరుపతయ్య కూడా రాజీనామా చేస్తున్నారని ఆయన తెలిపారు. భవిష్యత్తు తన రాజకీయ కార్యాచరణలో కూడా అందరి సహకారం వుండాలని కోరుకుంటున్నానని మద్ది శంకర్ కోరారు.
