నెక్ట్స్ టార్గెట్ ఆపరేషన్ ‘తెలంగాణ’

ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే యూపీలో బీజేపీ దూసుకెళ్లింది. అనుకున్నట్లే ఉత్తర ప్రదేశ్‌ను మరోసారి బీజేపీ నిలబెట్టుకుంది. 2017 మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తనకు ఎదురులేదని నిరూపించింది. ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షాల వ్యూహా రచన మరోసారి ఫలించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విజయంలో వారిదే కీలక భూమిక. ఇదిలాఉంటే.. తాజాగా వెలువడిన యూపీ ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయా? మోదీ, అమిత్‌షా ద్వయం ఆపరేషన్ ‘తెలంగాణ’ మొదలెట్టబోతున్నారా? సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు పావులు కదపడం కూడా రాష్ట్రంలో బీజేపీకి కలిసి రానుందా? అంటే.. చాలా వరకు అవుననే సమాధానం వస్తుంది. సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండడం, తెలంగాణలో ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్న నేపథ్యంలో యూపీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలోనూ బీజేపీ దూకుడు పెంచనుంది. దాంతో ప్రత్యామ్నాయ రేసులో మరికాస్త ముందుకు వెళ్లే అవకాశం లేకపోలేదు.